ఓటుకు వెళితే గులాబీపువ్వు.. మజ్జిగ ప్యాకెట్

Update: 2016-02-14 06:48 GMT
ఆదర్శాలు వల్లించే చాలామంది ఓటు వేయటానికి మాత్రం వెళ్లరు. ఎందుకంటే.. చాలానే కారణాలు చెబుతుంటారు. నిజానికి ఓటు వేయటానికి వెళ్లే వారికి చాలానే ఇబ్బందులు ఎదురవుతాయి. పోలింగ్ బూత్ ఎక్కడ? ఓటర్ స్లిప్పు ఎక్కడ పొందాలి? లాంటి డౌట్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి కాస్త దూరంలో ఓటరు స్లిప్పులు పంపిణీ చేసే రాజకీయ పార్టీలు ఉంటాయి. అయితే.. ఇలాంటివన్నీ పాత ముచ్చట్లుగా మారే దిశగా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందిస్తోంది.

ఇప్పటికే ఓటరు స్లిప్పుల్ని ఆన్ లైన్ లో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. మరిన్ని వసతులు కల్పించటం.. ఓటేయటానికి వచ్చిన వారంతా ఆహ్లాదకర అనుభూతి పొందేందుకు వీలుగా ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అలాంటి ప్రయత్నమే మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా చేపట్టింది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ఎంపిక చేసిన 20 కేంద్రాల్లో సరికొత్త విధానాన్ని అనుసరించింది. ఓటు వేయటానికి వచ్చిన ప్రతిఒక్క ఓటరుకు చేతికి గులాబీ పువ్వు ఇచ్చి స్వాగతం పలకటమే కాదు.. మజ్జిగ ప్యాకెట్ ఇవ్వటం అందరిని ఆకట్టుకుంది. ఓటు వేయటం బాధ్యతే అయినప్పటికీ.. ఓటు వేసే ప్రక్రియ ఆహ్లాదకరంగా ఉండాలన్న భావనకు తగినట్లే ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయటం బాగుందనే చెప్పాలి.
Tags:    

Similar News