వెంక‌య్య‌ను తేల్చుకోమ‌న్న సినీ ర‌చ‌యిత‌

Update: 2018-03-09 11:02 GMT
ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంలో మోడీ స‌ర్కారు తీరుతో ఏపీ ప్ర‌జ‌లు ఎంత హ‌ర్ట్ అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. హోదా ఎపిసోడ్ లో ప్ర‌జ‌ల మూడ్‌ను గుర్తించిన చంద్రబాబు తెలివిగా.. ఏదో చేస్తున్న‌ట్లుగా హ‌డావుడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హోదాపై జ‌గ‌న్ చేస్తున్న పోరాటాన్ని తగ్గించి చూపేందుకు ఆయ‌న ప‌డుతున్న పాట్లు అన్నిఇన్నికావు.

గ‌డిచిన మూడు.. నాలుగు రోజులుగా మీడియాలో జ‌రిగిన హ‌డావుడిని కాసేపు ప‌క్క‌న పెట్టి.. నిజాయితీ అస‌లేం జ‌రిగింద‌న్న విషయాన్ని చూస్తే.. అస‌లు విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. మోడీ కేబినెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారే కానీ.. మోడీ స‌ర్కారుకు త‌న మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకోలేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

హోదా మీద ఏపీ ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్న నేప‌థ్యంలో సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా రియాక్ట్ అవుతున్నారు. నిన్న‌టికి నిన్న ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కొర‌డా లాంటి పోస్ట ను సోష‌ల్ మీడియాలో పెట్టి సంచ‌ల‌నం సృష్టించారు. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రే టాలీవుడ్ ప్ర‌ముఖుడు ఈ స్థాయిలో మాట్లాడింది లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌ముఖ తెలుగు సినీ ర‌చ‌యిత బీవీఎస్ ర‌వి ఆస్తక్తిక‌ర ట్వీట్లు చేశారు. ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌పై ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.  శ్రీ వెంక‌య్య‌నాయుడు గారు ప‌వ‌ర్ లో ఉండాలా?  స్పెష‌ల్ స్టేట‌స్ గురించి చేసిన వాగ్దానాల‌ను ప్ర‌భుత్వం విస్మ‌రించినందుకు చేస్తున్న పోరాటంలో భాగంగా రిజైన్ చేసి చ‌రిత్ర‌లో నిలిచిపోవాలా? అన్న నిర్ణ‌యించుకునే స‌మ‌యం ఇదేనంటూ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. వెంక‌య్య‌ను  ఈస్థాయిలో ప్ర‌శ్నించింది ఎవ‌రూ లేర‌ని చెప్పాలి.

ఇక‌.. మ‌రో ట్వీట్ లో తెలుగు నేత‌లంతా క‌లిసి క‌ట్టుగా ఏపీ ప్ర‌త్యేక హోదాపై పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న మాట‌ను చెప్పారు. నిజంగా స్పెష‌ల్ స్టేట‌స్ మీద అన్ని పార్టీల‌కు చిత్త‌శుద్ధి ఉంటే హ‌క్కుల సాధ‌న‌కు ఒక అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేయాలి. మేధావుల‌ని.. కేంద్రంతో మాట్లాడ‌టం వ‌చ్చిన వారిని క‌లుపుకుపోవాల‌న్నారు.

ఐక‌మ‌త్యం లేకుండా.. క్రెడిట్ కోసం పోరాటాలు చేస్తే ఫ‌లితం శూన్య‌మ‌ని తేల్చేశారు. వైఎస్ జ‌గ‌న్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. చంద్ర‌బాబుల‌కు తెలంగాణ పోరాటం స్ఫూర్తి కావాల‌ని ట్వీట్ చేశారు. చూస్తుంటే.. టాలీవుడ్ నెమ్మ‌దిగా నోరు విప్ప‌టం మొద‌లైన‌ట్లుందే!
Tags:    

Similar News