ఇటు ఆత్మ‌కూరు.. అటు ర‌ఘురామ‌!

Update: 2022-02-24 14:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో రెండు ఉప ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వైసీపీ మంత్రి గౌత‌మ్‌రెడ్డి హఠాన్మ‌రణంతో ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఖాళీ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ జ‌గ‌న్ కేబినేట్‌లో మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించే గౌత‌మ్ మ‌ర‌ణం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.  ఆయ‌న క‌న్నుమూయ‌డంతో ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఖాళీ అయిన‌ట్లు ఏపీ అసెంబ్లీ నోటిఫై చేసింది. దీంతో నోటిఫై చేసిన రోజు నుంచి ఆరు నెల‌ల్లోపు ఆ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. గౌత‌మ్ అంత్య‌క్రియలు జ‌రిగిన రోజునే ఎన్నిక‌ల సంఘానికి ఏపీ అసెంబ్లీ అధికారికంగా స‌మాచారం ఇచ్చింది.

ఆ కుటుంబం నుంచి..

గౌత‌మ్‌రెడ్డి మృతితో ఖాళీ అయిన శాస‌న‌స‌భ స్థానంలో ఆయ‌న కుటుంబం నుంచి ఎవ‌రైనా పోటీ చేస్తే ఉప ఎన్నిక ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశం ఉంది. అయితే ఆ కుటుంబం నుంచి పోటీ చేసేందుకు ఎవ‌రైనా ముందుకు వ‌స్తారా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. గౌత‌మ్ బాబాయ్ చంద్ర‌శేఖ‌ర రెడ్డి ప్ర‌స్తుతం ఉద‌య‌గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో గౌత‌మ్ స‌తీమ‌ణి లేదా ఆయ‌న సోద‌రుల్లో ఎవ‌రైనా వైసీపీ నుంచి బ‌రిలో దిగేందుకు ముందుకు వ‌స్తారా? అన్న‌ది చూడాలి.

అందుకే ఇప్పుడు..

మ‌రోవైపు అసెంబ్లీ స్థానాన్ని ఇంత త్వ‌ర‌గా నోటిఫై చేసేందుకు మ‌రో కార‌ణం కూడా ఉంద‌ని తెలుస్తోంది. వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి న‌ర‌సాపురం నుంచి ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ త‌ర్వాత స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై అనర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్‌ను వైసీపీ ఎంపీలు కోరిన సంగతి తెలిసిందే.

అందుకే అధికారికంగా అన‌ర్హ‌త వేటు ప‌డేకంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నిక‌లో పోటీ చేయాల‌ని ర‌ఘురామ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో న‌ర‌సాపురంలో ర‌ఘురామ వ‌ర్సెస్ వైసీపీగా పోటీ ఉండ‌నుంది. ఆయ‌న బీజేపీ నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో అదే స‌మ‌యంలో ఇటు ఆత్మ‌కూరు ఉప ఎన్నిక కూడా జ‌రిగితే అది వైసీపీకి క‌లిసొస్తుంద‌ని జ‌గ‌న్ భావించార‌ని తెలిసింది. ఎలాగో ఆత్మ‌కూరులో వైసీపీ జెండా ఎగురుతుంది. ఈ నేపథ్యంలో న‌రసాపురంలోనూ ర‌ఘురామ‌ను ఓడించేందుకు పార్టీకి అవ‌స‌ర‌మైన ఆత్మ‌విశ్వాసం ద‌క్కే అవ‌కాశం ఉంది. అందుకే ఒకేసారి ఇటు ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానానికి, అటు న‌ర‌సాపురం లోక్‌స‌భ‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగేలా ముందుగానే ఎన్నిక‌ల సంఘానికి స‌మాచారం ఇచ్చిన‌ట్లుగా పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

Tags:    

Similar News