మునుగోడు ఉప ఎన్నిక : మునిగేది ఎవరు...తేలేది ఎవరు...?

Update: 2022-08-03 03:42 GMT
తెలంగాణాలో రాజకీయం ఏ వైపున ఉన్నది. ప్రజల ఆదరణ ఏవైపున ఉంది అని తెలియచేసే చిట్ట చివరి అవకాశంగా మునుగోడు ఉప ఎన్నికను చూడాలి. మునుగోడు ఎమ్మెల్యే పదవికి సిట్టింగ్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. రాజగోపాల్ బీజేపీలోకి వెళ్తున్నారు.

ఆయన కాషాయం కప్పుకుని బరిలోకి దిగుతారు. ఇక కాంగ్రెస్ కి బలమైన క్యాడర్ ఉన్న సీటు ఇది. అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ ప్రభావం ఇక్కడ ఎక్కువ. వారితోనే పార్టీ అన్నట్లుగా ఉంటుంది. ముందుగా క్యాడర్ ఒపీనియన్ తీసుకునే రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఒక విధంగా చెబితే కాంగ్రెస్ లో మెజారిటీ సెక్షన్ అంతా కోమటిరెడ్డి వెంట ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ఆ విధంగా కాషాయం పార్టీకి ఇక్కడ పెద్దగా బలం లేకపోయినా రాజగోపాల్ చేరుతూనే అన్నీ  తెచ్చుకుంటాడన్న మాట. ఆయన మీద పందెం కాసి బీజేపీ చాలా ఈజీగా గెలుపు కోసం పోరాడుతుంది అని చెప్పాలి. ఒక ఈటెల రాజెందర్, ఒక రఘునందన్ విజయాలు మాదిరిగా మునుగోడులో రాజగోపాల్ గెలిచినా కూడా అది కమలం ఖాతాలో వేసుకుంటుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో మా విజయం ఖాయమని ఢంకా భజాయిస్తుంది అన్న మాట.

ఇక చూస్తే టీయారెస్ అధికార పార్టీ. దానికి ఉన్న అన్ని శక్తియుక్తులు, అండదండలు, హంగులు పూర్తిగా ఉన్నాయి. ఒక్క మునుగోడు ఫలితాన్ని తమ వైపునకు తిప్పుకుంటే 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పుకోవచ్చు అన్నదే గులాబీ పార్టీ ఆశ. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతుంది అనడంలో సందేహం లేదు. ఈ సీటు టీయారెస్ కచ్చితంగా గెలవాల్సినది. ఈ టైం లో గెలిస్తే టీయారెస్ దూకుడు వేరేలా ఉంటుంది. అయితే ఇది కాంగ్రెస్ సీటు. దాంతో టీయారెస్ కి ఉండాల్సిన ఇబ్బందులు ఉన్నాయి.

మరో వైపు కాంగ్రెస్ కి అభ్యర్ధి నుంచి అన్నీ కొత్తగానే ఉంటాయి. క్యాడర్ రాజగోపాల్ వైపు వెళ్లకుండా మళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కి ఉంది. అలాగే గత రెండు ఉప ఎన్నికల మాదిరిగా ఆటలో అరటిపండు కాకుండా గట్టిగా తానూ ఉన్నానని చెప్పుకోవాలి. మొత్తానికి టఫ్ టాస్క్ ఇది. ఏ మేరకు కాంగ్రెస్ సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.

ఇక చూస్తే మునుగోడుకు నవంబర్ మూడవ వారంలో ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. దేశంలో గుజరాత్ రాష్ట్రానికి అపుడు ఎన్నికలు ఉన్నాయి. దాంతో పాటుగా ఈ ఉప ఎన్నికను కలిపి అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది. అంటే ఇప్పటికి కచ్చితంగా మూడున్నర నెలల సమయం ఉంది. మూడు పార్టీలు సెమీ ఫైనల్స్ లో విజేత కావడం కోసం ఈ క్షణం నుంచే పరుగు స్టార్ట్ చేశాయి. మరి మునుగోడు ఫలితం ఏమి చెబుతుంది. ఇక్కడ గెలిస్తే తెలంగాణాలో అధికారం ఖాయమా. అసలు ఏమి జరగబోతోంది. రాజజీయ వెండితెర మీద చూడాల్సిందే.
Tags:    

Similar News