రాహుల్ స‌మ‌క్షంలో పార్టీలో చేరి..ఇప్పుడు జంప్

Update: 2019-03-12 05:07 GMT
కొంద‌రు నేత‌లు మ‌హా తెలివిగా ఉంటారు. బోలెడంత రాజ‌కీయ అనుభ‌వం ఉంటుంది. అంగ బలానికి.. అర్థ బ‌లానికి కొద‌వ ఉండ‌దు. కానీ.. ఏ టైంలో ఏం చేయాల‌న్న చిన్న లాజిక్ మిస్ అయ్యే కొంద‌రు నేత‌ల రాజ‌కీయ జీవితం చిత్రంగా త‌యార‌వుతుంది. ఒక‌ప్పుడు క‌ర్నూలు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడిగా.. సీనియ‌ర్ నేత‌గా ఉన్న బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర్వాతి కాలంలో తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా ఈ రోజున ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది.

పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతంగా ఉద్య‌మ సంస్థ‌ను స్టార్ట్ చేసి.. ఆ త‌ర్వాత సొంతంగా పార్టీ పెట్టిన బైరెడ్డి ఆ మ‌ధ్య‌న రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో కండువా వేసుకున్నారు. త‌న జీవిత‌కాలంలో కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన ఆయ‌న త‌ర్వాతి కాలంలో ఆయ‌న ఆ పార్టీలో చేర‌టం కాల‌వైచిత్రిగా చెప్పాలి.

అయితే.. కాంగ్రెస్ కు ఏపీలో భ‌విష్య‌త్తు లేద‌న్న విష‌యాన్ని గుర్తించిన బైరెడ్డి.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని డిసైడ్ అయ్యారు. డీసీసీ ప‌ద‌వి విష‌యంలో ర‌ఘువీరాకు బైరెడ్డికి ఉన్న విభేదాలే ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కురావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు.

తాజాగా త‌న స‌న్నిహితుల‌తో మాట్లాడుతున్న బైరెడ్డి.. త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించ‌న‌నున్నారు. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్ప‌నున్న బైరెడ్డి.. ఏ పార్టీలో చేర‌తార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది. కేవ‌లం ఏడాది వ్య‌వ‌ధిలో పార్టీ మార‌నున్న బైరెడ్డికి ఏ పార్టీ అవ‌కాశం ఇస్తుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.
Tags:    

Similar News