ఇలాగైతే ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం తప్పదు: సీమ నేత హెచ్చరిక!

Update: 2023-02-26 16:01 GMT
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఎగువ (అప్పర్‌) భద్ర ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌) వద్ద ఆయన ‘మహా పాదయాత్ర, ప్రజాప్రదర్శన’ను  ప్రారంభించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 28న ఆదోనికి చేరుకుంటుంది.

తన పాదయాత్రలో భాగంగా తొలిరోజు ఆర్డీఎస్‌ వద్ద గంగమ్మకు పూజలు నిర్వహించి బైరెడ్డి రాజశేఖరరెడ్డి తన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కోసిగిలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు నికర జలాలను అందకుండా చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కర్ణాటక అప్పర భద్ర ప్రాజెక్టు నిర్మిస్తే రాయలసీమకు చుక్క నీరు అందదని ఆందోళన వ్యక్తం చేశారు.

 సీమ రైతుల గొంతు కోసేలా అప్పర్‌ భద్రకు రూ.5,300 కోట్లు మంజూరు చేసి.. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం సిగ్గుచేటని కేంద్ర ప్రభుత్వంపై బైరెడ్డి ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్టు ఆపేంతవరకు పోరాడతామన్నారు. అనంతరం పాదయాత్రగా అగసనూరు, చిర్తనకల్, దుద్ది, కోసిగి మీదుగా తరలివెళ్లారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు అప్పర్‌ భద్ర విషయంలో మేలుకోవాలని కర్ణాటకపై ఒత్తిడి చేయాలని బైరెడ్డి కోరారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తలెత్తే పరిస్థితి ఉందన్నారు. కర్ణాటక అప్పర భద్ర నిర్మిస్తే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని బైరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ పై సీమ ప్రాంత ఎమ్మెల్యేలు నోరు విప్పకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.


కర్ణాటక అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడితే రాయలసీమ ప్రాంతం సాగు, తాగు నీరు అందక ఎడారిగా మారే ప్రమాదం ఉందని బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బ్యారేజ్‌ పై తెలంగాణ– ఆంధ్రా సరిహద్దుల్లో తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మించాలని కోరారు. తీగల వంతెనపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పందించాలన్నారు. ఆర్డీఎస్‌ ఆనకట్ట నిర్మితమైతేనే కర్నూలు జిల్లా రైతులకు నికర జలాలు అందుతాయన్నారు.

1978, 1983, 1989ల్లో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. శేషశయనారెడ్డి. ఆయన తదనంతరం 1994, 1999ల్లో ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి గౌరు చరిత చేతిలో బైరెడ్డి ఓడిపోయారు. ఇక 2009లో అప్పటివరకు జనరల్‌ నియోజకవర్గంగా ఉన్న నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో బైరెడ్డి పాణ్యం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జరుగుతున్నప్పుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి సైతం టీడీపీ నుంచి బయటకొచ్చి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక ఉద్యమం నడిపారు.

 బైరెడ్డి కుమార్తె శబరి ప్రస్తుతం బీజేపీలో యువమోర్చాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె చురుకుగా ఉంటున్నారు. 2014లో బైరెడ్డి శబరి పాణ్యం నుంచి రాయలసీమ పరిరక్షణ సమితి గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 5 వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి.ఈ నేపథ్యంలో తన కుమార్తె భవిష్యత్తుపై పెద్ద ఆశలు పెట్టుకున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి ఉద్యమాల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు. అందులో భాగంగానే అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై గళమెత్తుతున్నారని చెబుతున్నారు.

అయితే తనకు రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని, రాయలసీమ ప్రజల బతుకే ముఖ్యమని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అంటున్నారు. మార్చి మొదటి వారంలో రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో అప్పర్‌ భద్రకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించి ప్రధానికి పంపుతామని వివరిస్తున్నారు.

Similar News