వైసీపీలోకి జేసీ బ్ర‌ద‌ర్స్‌.. బైరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2023-03-10 21:24 GMT
వైసీపీ యువ నాయ‌కుడు, క‌ర్నూలు జిల్లాకుచెందిన నేత‌, శాప్(క్రీడా ప్రాదికార సంస్థ‌) చైర్మ‌న్ బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి తాజాగా సంచ‌ల న వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డిల‌పై వ్యాఖ్య‌లు గుప్పించారు. వారిరువురూ.. వైసీపీలోకి వ‌చ్చేందుకు రెడీగా ఉన్నార‌ని.. తమ పిల్ల‌ల‌ను కూడా వైసీపీలోకి పంపించాల‌ని చూస్తున్నార‌ని సిద్ధార్థ‌రెడ్డి అన్నారు. అయితే.. వారిని చేర్చుకునేది లేద‌న్నారు. తాడిప‌త్రిలో రౌడీ ఇజం చేసిన వ్య‌క్తుల‌ను ఎలా చేర్చుకుంటామ‌న్నారు.

జేసీ బ్రదర్స్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు.  సేవ్ తాడిపత్రి నినాదాలు ఇస్తున్నారని.. కానీ, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే తాడిపత్రిలో దౌర్జన్యాలు ఆగాయ‌ని కితాబునిచ్చారు. రౌడీ మామూళ్ల వసూళ్లు లేవని వివరించారు. తాడిపత్రి ప్రజలు జేసీ కుటుంబం నుంచి కాపాడే వాడే లేడా అని చూసిన ప్రజలకు పెద్దారెడ్డి రూపంలో స్వేచ్చ లభించిందన్నారు.

బస్సులు అక్రమంగా నడిపి సామాన్యుల ప్రాణాలు తీసారని జేసీల‌పై విరుచుకుప‌డ్డారు.  పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ప్రజాస్వామ్యం నెలకొల్పారన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచే తొలి సీటు తాడిపత్రి అని చెప్పుకొచ్చారు. ఇక‌, మ‌రోవైపు.. బైరెడ్డి చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌ను కుప్పం ప్ర‌జ‌లు 40 ఏళ్ల‌పాటు గెలిపిస్తే.. ఏనాడూ అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. కానీ, జ‌గ‌న్ దెబ్బ‌తో ఇప్పుడు నెల‌కోసారి కుప్పం ప‌ర్య‌ట‌న‌లు ఎట్టుకున్నార‌ని ఎద్దేవా చేశారు.

కుప్పం ప్రజల విలువ చంద్రబాబుకు తెలిసేలా జగన్ చేసారని బైరెడ్డి పేర్కొన్నారు. టీడీపీకి 75-80 నియోజకవర్గాల్లో అభ్యర్దులు లేరని బైరెడ్డి వ్యాఖ్యానించారు. రాయ‌ల‌సీమలోని 30 నియోజకవర్గాల్లో టీడీపీ బీ ఫాం ఇచ్చినా పోటీకి సిద్దంగా ఎవ‌రూ లేర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అనంత‌పురం జిల్లాలోని టీడీపీ నేతలు తాము గెలిచినా గెలవకున్నా జేసీ బ్రదర్స్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని బైరెడ్డి జోస్యం చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Similar News