బైరెడ్డిని అడుగుపెట్ట‌నీయం...!

Update: 2022-01-27 15:30 GMT
బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఇప్పుడు ఈ పేరు అధికార వైసీపీలో ఓ సంచ‌ల‌నం. నూనుగుమీసాల ఈ పొలిటిక‌ల్ యంగ్ హీరో త‌న ప‌దునైన పంచ్‌లు, రాజకీయంతో ఏపీ వైసీపీలో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బైరెడ్డికి నామినేటెడ్ ప‌ద‌వి వ‌చ్చాక ఇప్పుడు స్టేట్ వైడ్‌గా యూత్‌లో మాంచి పాపుల‌ర్ అయిపోయాడు. బైరెడ్డి భ‌విష్య‌త్తులో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అవ్వ‌డంతో పాటు ఆ పార్టీ త‌ర‌పున కేబినెట్ మంత్రి కూడా అవుతారంటూ ఒక్క‌టే ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది.

బైరెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరు. ఇది ఎస్సీ రిజ‌ర్వ్‌డ్‌. అయితే నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా బైరెడ్డే ఉన్నారు. అక్క‌డ ఎమ్మెల్యే తొగురు ఆర్థ‌ర్‌కు బైరెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తేనే భ‌గ్గుమంటోంది. అయితే అధిష్టానం నుంచి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల వ‌ర‌కు అంద‌రూ బైరెడ్డికే కాస్త పైచేయి చూపిస్తున్నారు. ఇది వేరే సంగ‌తి. ఒక వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బైరెడ్డి పోటీ చేయాల‌నుకుంటే అందుకు జ‌న‌ర‌ల్ సీటుగా ఉన్న పాణ్యం ఒక్క‌టే ఆప్ష‌న్‌.

ప్ర‌స్తుతం అక్క‌డ నుంచి సీనియ‌ర్ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాట‌సానికి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన సొంత వ‌ర్గం ఉంది. ఇప్పుడు బైరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తామ‌న్న సంకేతాలు ఇస్తూ ఉండ‌డంతో కాట‌సాని వ‌ర్గం ఎలెర్ట్ అయ్యింది. అస‌లు బైరెడ్డిని పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలోనే అడుగు పెట్ట‌నీయం అని ఆ వ‌ర్గం స‌వాల్ చేసి మ‌రీ చెపుతోంది.

బైరెడ్డి ఏదో నాలుగు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చి.. మూడు పంచ్ డైలాగులు చెప్పినంత మాత్రాన ఎమ్మెల్యే సీటు రాద‌ని.. ఈ జిల్లాలోనే బైరెడ్డికి సీన్ లేద‌ని కాట‌సాని వ‌ర్గం ఘంటాప‌థంగా చెపుతోంద‌ట‌. జిల్లాలో జ‌గ‌న్ పేరు చెప్ప‌కుండా బైరెడ్డి ఒక్క గ్రామానికి అయినా వెళ్ల‌గ‌ల‌రా ? అని కాట‌సాని వ‌ర్గం బైరెడ్డికి ప్ర‌శ్న‌లు విసురుతోంది.

ఆ మాట‌కు వ‌స్తే బైరెడ్డి దూకుడు జిల్లాలో కాట‌సానికి మాత్ర‌మే కాదు.. మిగిలిన సీనియ‌ర్ నేత‌లు, మంత్రుల‌కు కూడా కాస్త కంట్లో న‌లుసులాగానే మారింద‌ని అంటున్నారు. బైరెడ్డిని త‌మ నియోజ‌క‌వర్గాల్లో వేలు పెట్ట‌నిస్తే ఎక్క‌డ దూసుకుపోతాడో ? అని వారి జాగ్ర‌త్తల్లో వారు ఉన్నారు.
Tags:    

Similar News