ఎలెక్షన్ కాబినెట్ కాదు ఇది

Update: 2022-04-10 16:30 GMT
ఎన్నో అంచనాలు, మరెన్నో విశ్లేషణలు, ఇంకెన్నో వడపోతలు, అలాగే ఎన్నో మార్పులు చేర్పులు, గంటల తరబడి చర్చలు. చివరికి మంత్రి వర్గం లిస్ట్ బయటకు వచ్చాక చూస్తే అంతా షాక్ తినాల్సిన పరిస్థితి ఉంది. ఒక విధంగా తొలి మంత్రి వర్గమే బెటర్ అన్న పరిస్థితి కూడా ఉందని చెబుతున్నారు.

చాలా మంది ఆశావహుల ఆశలు గల్లంతు కాగా అనూహ్యంగా కొత్త పేర్లు యాడ్ అయిపోయాయి. అలాగే చాలా మంది నోరున్న వారు, పేరున్న వారు కూడా లిస్ట్ లో కనిపించలేదు. నిజానికి తొలి మంత్రివర్గంలో గట్టిగా నిలబడిన వారు, పనిచేసిన వారు కూడా ఇపుడు గాయబ్ అయిపోయారు.

ఈ మంత్రివర్గాన్ని ఎన్నికల క్యాబినెట్ గా చెప్పుకోవడం పట్ల పెదవి విరిచేవారు కూడా ఉన్నారు. దీనికి కొన్ని విషయాలు చెప్పుకుంటే అనంతపురం జిల్లాలో ఒకే ఒక మంత్రిని లేటెస్ట్ ఎంపికలో ఉంచారు. కొత్త జిల్లాగా చేసిన శ్రీ సత్యసాయి నుంచి తిప్పేస్వామికి మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారు.

ఇక చాలా జిల్లాలలో చూస్తే మంత్రులుగా ఎంపిక చేసిన వారికి సొంత నియోజకవర్గాలలో వ్యతిరేకత ఉంది. వారు వచ్చే ఎన్నికల్లో గెలవరు అని సొంత పార్టీ వారే డౌట్ పెట్టేసుకుంటున్న సీన్. అలాంటిది వారికి ఇపుడు మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల క్యాబినెట్ అంటే ఇబ్బందిగానే ఉంది అంటున్నారు.

ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లా అంటే చాలా స్ట్రాంగ్ హోల్డ్ గా టీడీపీకి చెబుతారు. అలాంటి జిల్లాలో ఒకే ఒక మంత్రి పదవితో సరిపెట్టి నోరున్న పేరున్న పేర్ని నాని, కొడాలి నానిలని మాజీలను చేసేశారు. అలాగే ఇదే జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మాజీ అయ్యారు.

ఇక నెల్లూరు జిల్లాలో ఇప్పటిదాకా ఇద్దరు మంత్రులు ఉంటే ఇపుడు ఒక్కరికే చాన్స్ ఇచ్చారు. బాగా పనిచేసారు అనిపించుకున్న బీసీ మంత్రి, యువకుడు అయిన అనిల్ కుమార్ యాదవ్ కి చెక్ చెప్పేసారు. నిజంగా ఆయన దూకుడుగా పనిచేస్తారు అని పేరు తెచ్చుకున్నారు.  ప్రకాశం జిల్లా విషయానికి వస్తే మొత్తం వ్యవహారాలను చక్కబెట్టే బాలినేని శ్రీనివాసరెడ్డిని మాజీని చేసి సైడ్ చేసేశారు.

ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే దమ్మున్న లీడర్లు చాలా మంది మంత్రులు కాలేకపోయారు అని అంటున్నారు. ఇక్కడ కూడా టీడీపీకి మంచి పట్టు ఉంది.  ఢీ కొట్టాల్సిన చోట  కూడా పార్టీకి, ప్రభుత్వానికి విధేయతతో  ఉండే నేతలను పక్కన పెట్టేయడంతో వారు మండిపోతున్నారు.

ఇక  ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే కురసాల కన్నబాబు మంచి వాగ్దాటి కలిగిన విషయం ఉన్న మంత్రిగా పేరు పడ్డారు. ఇపుడు ఆయన్ని తప్పించేశారు. ఇక కాకినాడ అర్బన్  నుంచి రేసులో ఉన్న  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా ఆఫర్ లేదన్న అసంతృప్తి ఉంది.

కొత్త మంత్రులు, పాత మంత్రులు అంతా చూసుకున్నా దూకుడు నేతలు లేని లోటు అయితే స్పష్టంగా అయితే  కనిపిస్తోంది. రాయలసీమలో గట్టి నేతలు చాలా మంది ఉన్నా మంత్రి లిస్ట్ లోకి రాలేకపోయారు. మరి ఎన్నికల మంత్రి వర్గం అని చెప్పినా ఆ కళ, క్రేజ్ అయితే లేవు అని చాలా మంది పెదవి విరుస్తున్నారు. చూడాలి మరి ఇదే చివరి విస్తరణ లేక ఎన్నికలకు మరి కొద్ది రోజుల ముందు మరో విస్తరణ ఉంటుందా అన్నది. ఇదే మంత్రివర్గంతో వెళ్తే మాత్రం వైసీపీకి ఇబ్బందులే అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.
Tags:    

Similar News