వ‌ల‌స‌ల్ని ఏరేసేందుకు ట్రంప్ తాజా స్కెచ్ ఇది

Update: 2018-03-28 03:53 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు వ‌ల‌సదారుల‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ ద‌ఫా విధానప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వంటి వాటికి తోడుగా మ‌రోమారు అధ్యక్ష ఎన్నికల నినాదంగా మార్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది మరోసారి అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓటర్ల వివరాలు సేకరించేందుకు ఓ ప్రశ్నావళి రూపొందించారు. 'మీరు ఎప్పటి నుంచి అమెరికాలో నివాసముంటున్నారు. మీ పౌరసత్వం వివరాలు తెలియజేయాలి. మీరు వలస వచ్చినట్టయితే వాటి వివరాలు అందించాలి' అంటూ ట్రంప్‌ ఓ ప్రశ్నావళి రూపొందించారు. ఈ ప్ర‌శ్నాప‌త్రం ప‌ట్ల వ‌ల‌స‌వాదుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.

తాజా ఎన్నిక‌ల్లో 'మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌' అనే నినాదంతో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమెరికాలో నిరుద్యోగ సమస్యను పారద్రోలడమే కాకుండా, అమెరికాను ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలుపుతానని ఓటర్లకు మభ్యపెట్టారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తానని అన్నారు. అయితే, అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ట్రంప్‌ ఆలోచన విధానంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన చేపట్టిన అనేక సంస్కరణలు - కీలక నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఓ దశలో అమెరికా మిత్రదేశాలు సైతం ట్రంప్‌ నిర్ణయాలపై పెదవివిరిచాయి. ట్రంప్‌ తీసుకున్న అనేక నిర్ణయాలపై అమెరికా కోర్టుల్లో చుక్కెదురైంది. దీంతో, చేసేదేమీ లేక పలు నిర్ణయాలను ట్రంప్‌ సవరించుకొని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. అయిన‌ప్ప‌టికీ ట్రంప్ మ‌రోమారు వ‌ల‌స‌దారుల‌పై క‌త్తిగ‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

వ‌ల‌సదారులే ల‌క్ష్యంగా పౌర‌స‌త్వం - నివాసం వివ‌రాలు సేక‌రించేందుకు ప్ర‌శ్నప‌త్రం ఇచ్చారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని కాలిఫోర్నియా ఏజీ జేవియర్‌ బెసీరా విమర్శిస్తున్నారు. వలసదారులకు అమెరికాలో జీవించే హక్కు ఉందన్నారు. ట్రంప్‌ సూచించిన ప్రశ్నలు జాత్యహంకార భావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. పౌరసత్వానికి సంబంధించి రూపొందించిన ప్రశ్నలన్నీ 1950 వరకు అమెరికాలో ఉండేవని, అవన్నీ గతంలోనే రద్దయిన విషయాన్ని ఏజీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వలసదారుల ఏరివేత అజెండాతో ట్రంప్‌ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నారని ఏజీ విమర్శించారు. కాలిఫోర్నియాలో 23లక్షల మంది వలసదారులున్నారని అన్నారు. ఓటర్ల వివరాలను సేకరించేందుకు ట్రంప్‌ పొందుపర్చిన ప్రశ్నలతో వారంతా భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు నమోదు చేసేందుకే పౌరసత్వానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్టు అధికారులు ఇస్తున్న వివరణ అసంతృప్తికరంగా - పొంతనలేకుండా ఉన్నదన్నారు. అందుకే, ట్రంప్‌ సర్కార్‌ పై వ్యాజ్యం దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తాను చేస్తున్న న్యాయపోరాటానికి 18 రాష్ట్రాలకు చెందిన ఏజీలు మద్దతిస్తున్నారని జేవియర్‌ తెలిపారు. గతంలో వలసదారుల పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరును జేవియర్‌ తప్పుపట్టారు. ముస్లిం వలసదారులపై ఉగ్రవాద ముద్ర మోపారని అన్నారు. దేశ భద్రత కోసం ముస్లిం వలసదారులను అమెరికాలో అనుమతించడం లేదని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు జాత్యహంకార భావాలకు అద్దంపడుతున్నాయని అన్నారు. అంతేగాకుండా, హెచ్‌-1బీ వీసాల మంజూరులో నియమ నిబంధనలు కఠినతరం చేశారని అన్నారు.
Tags:    

Similar News