జయహో స్టాలిన్.. ఇలాంటి బుద్ది మోడీకి రావాలని కోరుకుందాం

Update: 2021-05-17 16:48 GMT
కంటికి కనిపించే శత్రువుతో యుద్దం చేయటం మనిషికి అలవాటే. కానీ.. కంటికి కనిపించకుండా సవాలు విసిరుతూ.. తరచూ రూపాన్ని మార్చుకుంటూ కోట్లాది మందిని అస్వస్థతకు గురి చేస్తున్నకరోనా లాంటి మహమ్మారిమీద యుద్ధం చేయాలంటే సాదాసీదా రాజకీయ వ్యూహాలు సరిపోతాయా? అందుకు తగ్గ అస్త్రశస్త్రాలు అవసరం కదా? నిత్యం నీతులు వల్లించే మోడీ లాంటి నేత దేశ ప్రధానిగా ఉన్నప్పటికి ఎలాంటి ప్రయోజనం లేని పరిస్థితి. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే చాలు.. వారి సంగతి చూసే వరకు వదిలిపెట్టని ఆయన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అంతేనా.. రాష్ట్రాల్లోనూ అలాంటి పరిస్థితే. ఎప్పటిలానే అధికారపక్షం తాను ఎంతో కష్టపడిపోతున్నట్లుగా బిల్డప్ ఇవ్వటం.. అధికారపక్షాన్ని చీల్చి చెండాడేలా విపక్షాలు కొన్ని విరుచుకుపడటం.. రోటీన్ రొడ్డు కొట్టుడు సీన్ తప్పించి.. కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్న ఆలోచన దేశంలోని పాలకులకు లేని దుస్థితి. ఇలాంటివేళ.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన 68 ఏళ్ల స్టాలిన్ అనూహ్య నిర్ణయాల్ని తీసుకుంటున్నారు.

కోవిడ్ మీద పోరాటానికి 13 మంది ఎమ్మెల్యేలతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో.. 12 మంది విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. ఏఐడీఎంకే నేత.. ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కూడా కమిటీలో సభ్యుడిగా ఉండటం విశేషం. కోవిడ్ సంక్షోభంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని అనుసరించి ఈ బహుళ పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న వారు విపక్ష ఉనికి కనిపించకుండా చేయాలన్న లక్ష్యంగా పని చేస్తుండటం చూస్తున్నదే. అందుకు భిన్నంగా దేశంలో కొత్త సంప్రదాయానికి తెర తీస్తూ.. ఇటీవల కాలంలో మరింతగా దిగజారిన రాజకీయానికి భిన్నంగా స్టాలిన్ నిర్ణయం సంచలనంగా మారింది.

కొత్త రాజకీయ ఒరవడికి ఇది నాందిగా చెప్పక తప్పదు. కరోనా కష్టసమయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్ని కమిటీలో భాగమై ఉండటం.. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య సత్ సంబందాల్ని పెంచేలా తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రకంగా చెప్పక తప్పదు. స్టాలిన్ కు వచ్చిన ఐడియా ఈ దేశ ప్రధాని మోడీకి వచ్చి ఉంటే బాగుండేది. కరోనా కరాళ న్రత్యం చేస్తున్న వేళ.. దానికి చెక్ చెప్పేందుకు స్టాలిన్ ఐడియా భేష్ అని చెప్పాలి. అంతేకాదు..సాహో స్టాలిన్ అనకుండా ఉండలేం.

తాజాగా ఏర్పాటు చేసిన కమిటీపై మాజీ ఆర్థిక మంత్రి అన్నాడీఎంకే నేత విజయ్ కుమార్ ట్విటర్ ద్వారా రియాక్టు అవుతూ.. అన్ని రాజకీయ పార్టీలతో కలిపి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా మండలికి.. ప్రభుత్వానికి నా సంపూర్ణ సహకారం అందిస్తా. కోవిడ్ మొదటి వేవ్ నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఏమైనా.. దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా స్టాలిన్ చెప్పాలి. ఆయన తీసుకున్న నిర్ణయం కేంద్రంలోనే కాదు.. మిగిలిన రాష్ట్రాలు వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉంది. స్టాలిన్ కు వచ్చిన ఆలోచన మోడీకి వచ్చేలా ఆ దేవుడు ఆయనకు అవసరమైన బుద్ధి ఇవ్వాలని కోరుకుందాం.
స్టాలిన్ ఏర్పాటు చేసిన 13 మంది కోవిడ్ సలహా మండలిలోని సభ్యుల్ని చూస్తే..

స్టాలిన్...  ముఖ్యమంత్రి కమ్  ఛైర్మన్
డాక్టర్ ఎజిలన్   -  డీఎంకే
డాక్టర్ విజయభాస్కర్ -  ఏఐడీఎంకే
జీకే మణి     -  పీఎంకే
ఏఎం మణిరత్నం -  కాంగ్రెస్
నగర్ నాగేంద్రన్ -  బీజేపీ
సుశాన్ తిరుమలైకుమార్ -  ఎండీఎంకే
ఎస్ఎస్ బాలాజీ   - వీసీకే
టీ రామచంద్రన్ -  సీపీఐ
డాక్టర్ జవహారుల్లా  -  ఎంఎంకే
ఆర్ ఈశ్వరన్  -   కేఎండీకే
టీ వేల్మురుగన్ -  టీవీకే
పూవై జగన్ మూర్తి -  పీబీ
నాగై మాలి -  సీపీఎం
Tags:    

Similar News