క్యాన్ల‌లో గాలిని అమ్మేయ‌టం మొద‌లైందోచ్‌

Update: 2015-12-16 13:38 GMT
పాడు రోజులు వ‌చ్చేసిన‌ట్లే. మూడు ద‌శాబ్దాల ముందు ఇంటి వ‌ద్ద‌కు ఎవ‌రైనా నీళ్లు అడిగితే.. అయ్యో నీళ్లు ఎందుకండి.. మ‌జ్జిగ తాగండి అంటూ గ్లాసు మ‌జ్జిగ‌ను మ‌ర్యాద‌గా ఇచ్చి..కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసేవారు. కాలం మారింది. జీవితాల్లో వేగం పెరిగింది. మ‌నుషుల మ‌ధ్య దూరం రెట్టింపు అయ్యింది. స‌హ‌జ‌త్వం పోయి.. కృత్రిమ‌త్వం రోజురోజుకీ పెరిగి పెద్ద‌ద‌వుతోంది. వ్య‌క్తిగ‌త జీవితాలు ఎంత వేగంగా పెరిగిపోతున్నాయో.. అదే తీరులో స‌మాజాలు మారిపోతున్నాయి.

పెరిగిన పోటీత‌త్వం.. లాభాపేక్ష‌తో ప‌ర్యావ‌ర‌ణాన్ని మ‌నిషి ప‌ట్టించుకోవ‌టం  మానేసి చాలా కాలమే అయ్యింది. ఇది లేనిపోని విప‌త్తుల్ని తెచ్చి పెట్ట‌ట‌మే కాదు.. జీవితాల్ని దుర్భ‌రంగా మార్చేస్తున్న దుస్థితి. వివిధ దేశాల్లో పెరిగిన వాతావ‌ర‌ణ కాలుష్య‌మే చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇక‌.. పారిశ్రామికంగా దూసుకుపోయే క్ర‌మంలో చైనా ప‌రిమితుల్ని ప‌ట్టించుకోలేదు. ఆ దేశంలోని చాలా న‌గ‌రాలు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. మొన్నీ మ‌ధ్య‌నే బీజింగ్ న‌గ‌రంలో వాయుకాలుష్య తీవ్ర‌త పెరిగిపోయి.. రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించి.. దాదాపు వారం పాటు ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేసిన వైనం తెలిసిందే.

ఇలాంటి ప‌రిస్థితుల్ని చూసిన కెన‌డాకు చెందిన స్టార్ట‌ప్ కంపెనీ ఒక‌టి వినూత్న‌మైన ఆలోచ‌న ఒక‌టి చేసింది. వైటాలిటీ ఎయిర్ అన్న కంపెనీ త‌మ దేశంలోని ప‌ర్వ‌త ప్రాంత న‌గ‌ర‌మైన బాన్ఫ్ నుంచి తాజా గాలిని సేక‌రించి.. దాన్ని క్యాన్ల రూపంలో భ‌ద్ర‌ప‌రిచి.. చైనాకు ఎగుమ‌తి చేసింది. గాలిని అమ్మ‌టం ఏమిటి? కొనేవాడు అస‌లు ఉంటాడా? అన్న సందేహాల నేప‌థ్యంలో తొలి బ్యాచ్ లో 500 క్యాన్ల‌ను మాత్ర‌మే పంపింది. ఈ కంపెనీ సందేహాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ.. కేవ‌లం రెండు వారాల్లోనే ఈ క్యాన్లు హాట్ కేకులుగా అమ్ముడ‌య్యాయి. అంతేకాదు.. ఈ గాలి క్యాన్ల‌ను త‌మ‌కు పంపాల‌న్న ఆర్డ‌ర్లు భారీగానే వ‌స్తున్నాయ‌ట‌. ఇక‌.. ఈ గాలి క్యాన్ల ధ‌ర‌లు చూస్తే.. రూ.935 నుంచి రూ.1337 వ‌ర‌కు ఉన్నాయి. సైజుల్ని బ‌ట్టి క్యాన్ల‌ను అమ్ముతున్నారు. మంచినీళ్లు కొనుక్కోవ‌టం అల‌వాటైన మ‌నం.. రానున్న‌రోజుల్లో తాజా గాలిని డ‌బ్బాల్లో కొనాల్సిన పాడు రోజులు వ‌చ్చేస్తున్నాయా?
Tags:    

Similar News