ఏపీలో గంజాయి అరణ్యం .. ఆగని రవాణా, స్మగ్లర్లు కొత్తపంథా !

Update: 2021-11-01 06:07 GMT
ఆంధ్రప్రదేశ్ గంజాయి అక్రమ రవాణా , సాగు భారీగా జరుగుతుంది. ఈ మధ్య రోజుల్లో ఎక్కువగా తనిఖీల్లో పట్టుబడుతుండటం తో పోలీసులు కూడా అప్రమత్తమైయ్యారు. గంజాయి, డ్రగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అడుగడుగా చెక్‌ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించడంతో భారీ గంజాయి వెలుగులోకి వస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో గంజాయిని పూర్తిస్థాయిలో ఆరికట్టేందుకేందు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. పరివర్తన కార్యక్రమం ద్వారా గంజాయి నిర్మూలనకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ విశాఖ ఏజెన్సీ ని లక్ష్యంగా చేసుకొని గంజాయి పంట నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా, ప్రజలలో మార్పు తీసుకురావాలని చూస్తున్నారు.

విశాఖ ఏజెన్సీ కేంద్రంగా వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతుందని దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గంజాయి సాగు పై, గంజాయి హబ్ గా ఏపీ మారుతున్న తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో పట్టుబడ్డ గంజాయి సైతం మూలాలు ఏపీ లోనే ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంగా గంజాయి మాఫియా పెద్ద ఎత్తున దందా సాగిస్తుందన్న ఆరోపణలకు ఊతమిస్తూ రోజుకో ఘటన వెలుగులోకి వస్తుంది.

తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి సాగు తక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడ నుంచే గంజాయి రవాణా జరుగుతోందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు విశాఖ కేంద్రంగా గంజాయి సాగు అధికంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఫోకస్‌ చేయడంతో అప్రమత్తమైన గంజాయి స్మగ్లర్లు కొత్త దారుల్లో రవాణా కి సిద్ధమైవుతున్నారు. అనేక రకాలుగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో బొలోరో వాహనంలో తరలిస్తున్న700 కేజీల గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడిలో వాహనం సీజ్‌ చేసినట్లు నిందితులు పరారీలో ఉన్నట్లు వారు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులతో కలిసి పోలీసులు గంజాయి నిర్మూలనకు ‘పరివర్తన’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం ఏడుసావళ్లు, చీకుంబంద గ్రామాల సమీపంలో శనివారం ఒక్కరోజే దాదాపు 80 ఎకరాల్లోని గంజాయి తోటలను పోలీసులు, స్థానికులు ధ్వంసం చేశారు. విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ సతీష్‌కుమార్, స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్, పోలీస్‌ సిబ్బంది కత్తి చేతపట్టి గంజాయి మొక్కలను నరికేశారు. గూడెం కొత్తవీధి మండలం నేలజర్త, బొరుకుగొంది, కనుసుమెట్ట, కిల్లోగూడా, కాకునూరు, గుమ్మిరేవుల సమీప ప్రాంతాల్లో సుమారు 25 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.



Tags:    

Similar News