భారీ వర్షాలు: హైదరాబాద్ లో కార్లు సైతం కొట్టుకుపోయాయి

Update: 2020-10-14 14:30 GMT
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అవుతోంది. హైదరాబాద్‌ రెండుమూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. నగరపరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వరదనీరు పొంగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లుకూలి 9 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ నిన్న శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వదిలేయండని సూచించారు.

మంగళవారం కాకినాడ వద్ద వాయుగుండం తీరం దాటడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం మీదుగా కాకినాడ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. తెలంగాణలోని హైదరాబాద్ మీదనే అల్పపీడన ధ్రోణీ కేంద్రీకృతం కావడంతో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం సూచించారు.

కాగా ఈ వర్షాలకు హైదరాబాద్ లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతికి కార్లు సహా పలు వాహనాలు కొట్టుకుపోయాయి. సికింద్రాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ కింద పార్క్ చేసిన చేసిన కారు పైకి వరదలో కొట్టుకు వచ్చిన మరో కారు వచ్చి ఎక్కింది. ఇంకో వైపు మూడో కారు కూడా వచ్చి ఆ రెండు కార్లను ఢీకొట్టిన దృశ్యాలు హైదరాబాద్ లో వరద బీభత్సానికి నిదర్శనంగా నిలిచాయి.

హైదరాబాద్ లో వర్షాలకు భారీగా కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో వాటి యజమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్లు మాత్రమే కాదు.. భారీ వాహనాలు సైతం నీళ్లలో తేలుతూ కొట్టుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డ్రైవర్ లేకున్నా ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు ఇలా కొట్టుకుపోవడం చూసి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

హైదరాబాద్ లో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించింది. గత 24 గంటల్లో 20 సెం.మీలకు పైగా వర్షం పడింది. తెలంగాణలో వర్షానికి 12 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరో రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలను బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.
Tags:    

Similar News