మంత్రిని ‘‘జూలో పిల్లి’’ అన్నందుకు కేసు పెట్టారు

Update: 2016-04-18 06:32 GMT
రాజకీయాల్లో విమర్శలు సహజం. దూకుడు రాజకీయాలు షురూ అయ్యాక విమర్శల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. కొందరు నేతలు ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడినా.. ఎలాంటి పదాలు ప్రయోగించినా కిమ్మనకుండా ఉండే కొందరు.. మరికొందరు నేతలు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే చాలు.. తెలంగాణ ప్రజలకు అవమానం జరిగిందంటూ కేసులు పెట్టేయటం కనిపిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.

తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణకు.. తెలంగాణ అధికారపక్షానికి మధ్య నడుస్తున్న లొల్లి తెలిసిందే. డీకే అరుణ సోదరుడ్ని కారు ఎక్కించిన తీరు మీద డీకే అరుణ తీవ్ర ఆగ్రహంతో ఉండటమే కాదు.. పార్టీ మారేలా ప్రోత్సహించారంటూ మంత్రి జూపల్లె కృష్ణారావు మీద ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు చేస్తూ.. ‘‘జూలో పిల్లి’’గా అభివర్ణించారు. డీకే అరుణ నోటి వెంట ఆ మాట వచ్చినంతనే.. ఆమెపై చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదు కావటం గమనార్హం.

ప్రజలు ఎన్నుకున్న ఒక నేతను అలా అనటం ఏమిటని ప్రశ్నిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ తెలంగాణ లాయర్ల జేఏసీ ఒక ఫిర్యాదు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ విపక్ష నేతల మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యే గువ్వల బాలరాజు.. బాల్క సుమన్.. తదితర నేతల వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కావెందుకు..?
Tags:    

Similar News