జగన్ పై నోటి దురుసు...అయ్యన్నపై కేసు

Update: 2019-09-28 04:40 GMT
అధికారం కోల్పోయినా... మాట తీరు మార్చుకోని టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అధికారిపై దౌర్జన్యం చేసిన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేసు నమోదు కాగా... తాజాగా సాక్షాత్తు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా టీడీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపైనా ఇప్పుడు కేసు నమోదైపోయంది. జగన్ సర్కారు వ్యవహార సరళిపై ఇటీవలి కాలంలో వరుసగా మీడియా ముందుకు వస్తున్న అయ్యన్న.. మొన్న టీడీపీ విశాఖ నగర శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ జగన్ పైనా - జగన్ సర్కారుపైనా పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారట. జగన్ కు కుల - మత - ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్నారన్న ముద్రనూ ఆపాదించారట. మీడియా సమావేశంలో మాట్లాడిన అయ్యన్న మామూలుగానే వెళ్లిపోయారు.

అయితే అయ్యన్న ప్రెస్ మీట్ ను సాంతం పరిశీలించిన వైసీపీ నేతలు... అయ్యన్న చేసిన పరుష వ్యాఖ్యలను మాత్రం కరెక్టుగానే పట్టేశారట. ఈ క్రమంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల భర్త వెంకట్రావు నేరుగా విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అయ్యన్నపై ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో ఉన్న జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపై కేసు నమోదు చేయడంతో పాటు ఆయనను కఠినంగా శిక్షించాలని కూడా వెంకట్రావు తన ఫిర్యాదులో పోలీసులను కోరారు.

వెంకట్రావు చేసిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు... అయ్యన్నపై కేసు నమోదు చేసేశారు. అయ్యన్న చేసిన వ్యాఖ్యలు కుల - మత - ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగే ఉన్నాయని నిర్ధారించిన పోలీసులు... అయ్యన్నపై ఐపీసీలోని 153ఏ - 500 - 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అధికారులను దూషించిన కేసులో ఏకంగా నెల రోజుల పాటు అండర్ గ్రౌండ్ కు వెళ్లిన కూన రవికుమార్... బెయిల్ రావడంతో శుక్రవారమే ఇంటికి వచ్చారు. సరిగ్గా... కూన ఇటు ఇంటికి రాగానే... అటు అయ్యన్నపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడం గమనార్హం. మరి ఈ కేసును అయ్యన్న ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.


Tags:    

Similar News