నిరసనల వేళ.. హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదు

Update: 2019-12-20 10:45 GMT
అంశం ఏదైనా నచ్చినా.. నచ్చకున్నా సోషల్ మీడియాలో పోస్టు చేయటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇదే తీరు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం.. డ్రాయింగ్ రూంలో కూర్చొని తమ వాదనల్ని వీడియోల రూపంలో షేర్ చేయటం మామూలే అయినా.. ఏదైనా ఇష్యూ మీద రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేయటం.. అది కూడా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న పేరున్న నటులు దాదాపుగా చేయని పని. అందుకు భిన్నంగా చేసి కేసులు మీదేసుకున్నారు ప్రముఖ హీరో సిద్ధార్థ్.

ఇటీవల మోడీ సర్కారు చట్టం చేసిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలపై గళం విప్పిన సిద్ధార్థ్.. తాజాగా తమిళనాడులో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళనల్ని అణిచివేసేందుకు వీలుగా నిరసనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని వల్లూవర్ కొట్టంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న 600 మందిపైన పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు నమోదైన వారిలో హీరో సిద్దార్థ్ కూడా ఉండటం సంచలనంగా మారింది. సిద్ధార్థ్ తో పాటు సింగర్ టీఎం కృష్ణ తదితరులు ఉన్నారు. ఐపీసీ సెక్షన్ 143 కింద నిరసనకారులపై కేసును నమోదు చేశారు. రాజకీయ పార్టీలు.. విద్యార్థి సంఘాలతో కలిపి 38 గ్రూపులు నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికీ ఆందోళనలు చేపట్టారు.

దీంతో.. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నిరసనలు.. ఆందోళనలు.. శుక్రవారం కూడా కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల రాజధానుల్లోనూ.. ఇతర నగరాల్లో ఆందోళనల్ని నిర్వహించారు. నిరసన ర్యాలీల్ని.. రాస్తారోకోల్ని చేపట్టారు.
Tags:    

Similar News