నాయీ బ్రాహ్మ‌ణుల‌ను ఇలా పిలిస్తే క‌ఠిన చ‌ర్య‌లు!

Update: 2022-08-11 07:55 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క్షుర‌క వృత్తిలో ఉన్న‌వారికి ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యం తీసుకుంది. వారిని కొన్ని ప‌దాల‌తో సంబోధించ‌డాన్ని నిషేధించింది. ఇక మీద‌ట ఎవ‌రైనా ఆ ప‌దాల‌ను ఉచ్ఛ‌రిస్తూ నాయి బ్రాహ్మ‌ణుల‌ను, వారి సామాజిక‌వ‌ర్గాన్ని పిలిచిన‌ట్ట‌యితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. భార‌త శిక్షాస్మృతి 1860 కింద చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తారు. ఈ మేర‌కు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌య‌ల‌క్ష్మి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

జగన్ సర్కార్ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై నాయీ బ్రాహ్మణుల్ని మంగలి, మంగలోడ, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండమంగలి అనే పదాలతో పిలవకూడదు. దీంతో ఈ పదాల వాడకాన్ని నిషేధించారు. ఈ పదాలతో వారిని ఎవరైనా పిలిస్తే వారి మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచిన‌వారిగా భావిస్తారు. అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జ‌గ‌న్ ప్రభుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

2019 ఎన్నిక‌ల్లో బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌వేశ‌పెట్టి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీసీల‌కు నిజ‌మైన అండ‌గా నిలుస్తోంది వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆ పార్టీ చెప్పుకుంటోంది.

ఇప్ప‌టికే షాపులున్న‌ అర్హులైన‌ నాయిబ్రాహ్మ‌ణుల‌కు, ద‌ర్జీల‌కు ఏటా ప్ర‌భుత్వం రూ.10 వేల‌ ఆర్థిక సాయం చేస్తోంది. అంద‌రితోపాటే వారికి కూడా వివిధ సంక్షేమ ప‌థ‌కాలను వ‌ర్తింప జేస్తోంది.

అలాగే 139 బీసీ కులాల‌కు సంబంధించి మొత్తం 56 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది. నాయీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ను కూడా ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసింది. దీనికి సిద్ధ‌వటం యానాద‌య్య‌ను చైర్మ‌న్ గా నియ‌మించింది.

ఇదే క్రమంలో నాయీ బ్రాహ్మ‌ణుల‌ను ఎలా పడితే అలా పిల‌వ‌డాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా ఉత్త‌ర్వులు జారీ చేసింది. వారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందన్న వాదన నేపథ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌ని చెబుతున్నారు. దీంతో ఇకపై వారంతా ఆత్మగౌరవంతో జీవించ‌డానికి ప్ర‌భుత్వం బాట‌లు వేసింద‌ని అంటున్నారు.
Tags:    

Similar News