భూవివాదంలో ఇరుక్కున్న మంత్రి మల్లారెడ్డి బావమరిది

Update: 2022-05-19 11:32 GMT
తెలంగాణ కేబినెట్ లోనే అత్యంత వివాదాస్పదమైన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మల్లారెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదన్న విమర్శలున్నాయి.  మల్లారెడ్డి మీడియా ఎదుట అయినా.. బయట అయినా ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి మల్లారెడ్డి బావమరిదిపై మరో భూవివాదం కేసు నమోదు కావడం సంచలనమైంది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న తెలంగాణమంత్రి మల్లారెడ్డి. వరుస వివాదాలు, విమర్శలు, వ్యాఖ్యానాలతో ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డిపై సీరియస్ భూవివాదాలు రాజేశాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా మరో వివాదం ఆయన బావమరిది మెడకు చుట్టుకుంది.

గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితోపాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు ఉండడం విశేషం. ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండ్ కు తరలించినట్లు పేట్ బషీరా బాద్ పోలీసులు తెలిపారు.

సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5, 6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయకుడు మధ్య స్థల వివాదం నడుస్తోంది.

మూడు రోజుల కిందట రాత్రి ఒంటిగంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడ్డీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.

అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ కు తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి , విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు.
Tags:    

Similar News