సోషల్ మీడియాపైనా కేసులు పెట్టేస్తారట

Update: 2019-04-16 13:47 GMT
ఇప్పుడు మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియాదే కీలక భూమికగా మారిపోయింది. ఎక్కడ ఏ ఘటన జరిగినా... ఆ విషయం మీడియాకు తెలిసేలోగానే... సదరు విషయంతో పాటు ఫొటోలు కూడా సోషల్ మీడయాలో దర్శనమిస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ నెల 11న జరిగిన పోలింగ్ సంగతులు గానీ - అంతకుముందు జరిగిన ఎన్నికల ప్రచారంలోని సిత్రాలు గానీ మెయిన్ మీడియాలో కంటే సోషల్ మీడియాలోనూ ఫాస్ట్ గా వచ్చేశాయి. మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాదే కీలక భూమిక అని చెప్పాలి. అయితే విశ్వసనీయత విషయంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన మాత్రం వినిపిస్తోంది.

తప్పుడు వార్తలను - తమకు చేరిన విషయాలను పరిశీలించుకోకుండా ప్రసారం చేసే విషయంలో సోషల్ మీడియా కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇందులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా... కేసులు తప్పవన్న హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాకు జారీ అయిపోయాయి. ఈ తరహా వార్నింగులు ఇచ్చింది వేరెవరో కాదు... తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి రజత్ కుమారే. మొన్నటి ఎన్నికల సందర్భంగా జరిగిన పలు చిన్న చిన్న పొరపాట్లు - వెలుగు చూసిన కొన్ని దృశ్యాలను సోషల్ మీడియా పదే పదే ప్రసారం చేయడం, ఆ ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలను పరిశీలించకుండానే సోషల్ మీడియా వాటిని ప్రసారం చేసిన వైనంపై ఆయన నేడు తీవ్రంగానే స్పందించారు.

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న పలు వార్తలను ప్రస్తావించిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం సోషల్ మీడియాపై చాలా ఆగ్రహంగా ఉన్నట్లు చె.ప్పుకొచ్చారు. ప్రధానంగా పోలింగ్ పర్సంటేజీపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ జరిగిన రోజున ఎస్టిమేటెడ్ పోలింగ్ పర్సంటేజీలు మాత్రమే వస్తాయని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎస్టిమేట్స్ ను మాత్రమే పంపమని అడుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తాము కూడా ఎస్టిమేట్స్ వివరాలను మాత్రమే పంపిస్తామని కూడా తెలిపారు.

ఈ విషయంపై అంతగా పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియా అంతా తనకు తెలిసిపోయినట్టుగా వ్యవహరించడం తగదని, పోలింగ్ పర్సంటేజీలపై అధికారులు తప్పుడు లెక్కలు చెప్పారని ప్రసారం చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఇలా నిబంధనలను పక్కనపెట్టేసి... ఇష్టానుసారం వార్తలను ప్రసారం చేసే సోషల్ మీడియా సంస్థలపై కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన వార్నింగిచ్చేశారు. జగిత్యాలలో బయటకు వచ్చిన ఈవీఎంలు, స్ట్రాంగ్ రూం వద్ద ఫొటో తీసుకున్న ఓ నేతకు సంబంధించిన వార్తలపైనా ఆయన వివరణ ఇస్తూనే... వాస్తవాలను వక్రీకరించడం తగదని సోషల్ మీడియాకు సూచించారు.

   
   
   

Tags:    

Similar News