2జీ స్కాం: అంద‌రూ హ్యాపీ.. పిచ్చోళ్లు ఎవ‌రు?

Update: 2017-12-21 15:30 GMT
దేశం మొత్తం కిందామీదా ప‌డిపోయింది. జ‌నాలైతే బుగ్గ‌లు నొక్కుకున్నారు. హ‌వ్వ‌..హ‌వ్వ‌.. మ‌రీ ఇంత అన్యాయ‌మా? మ‌రీ.. ఇంత దారుణ‌మా? మ‌రీ.. ఇంత బ‌రితెగింపా? అని ఎవ‌రికి వారు తెగ ఫీల‌య్యారు. ఇదంతా ఎందుకంటే.. స‌హ‌జ వ‌న‌రుల్ని అధికార‌ప‌క్షం ఎంత దారుణంగా వాడుకుంటుందో తెలిసి గుండెలు బాదేసుకున్నారు. కాగ్ లెక్క‌ల ప్ర‌కార‌మైతే ఏకంగా ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయిల ప్ర‌జా సొమ్ము. త‌ర్వాతి ద‌శ‌ల్లో ఇది కాస్తా ముప్ఫై వేల కోట్ల చిల్ల‌ర‌గా లెక్క తేల్చారు.

ఈ భారీ స్కాం మీద ఎన్ని వంద‌ల ట‌న్నుల న్యూస్ ప్రింట్ వృధా అయ్యిందో లెక్క తీయ‌టం కూడా క‌ష్ట‌మే. ఇక‌.. ఎన్ని కోట్ల గంట‌లు టీవీల్లో చ‌ర్చ‌ల రూపంలో ఖ‌ర్చు అయ్యాయో.. ఈ స్కాం మీద కోట్లాది మంది అదే ప‌నిగా మాట్లాడుకోవ‌టం.. స్పందించ‌టం.. వ్యాసాలు రాయ‌టం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే చ‌ర్చ జ‌రిగింది.

అందుకు మించిన ర‌చ్చ జ‌రిగింది. ఈ స్కాం బ‌య‌ట‌కొచ్చి దాదాపు ఆరేడేళ్లు అయ్యింది.  యూపీఏ ప్ర‌భుత్వం మీద భారీ మచ్చ ప‌డేలా చేసింది. మ‌న్మోహ‌న్ సింగ్ పాల‌న‌కు ముగింపు ప‌ల‌క‌లంలో 2జీ స్కాం ఎంత కీల‌క‌మైందో తెలియంది కాదు.  2జీ స్కాం మీద ఒక‌లాంటి ఉద్య‌మ‌మే చేశారు బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి.  ఈ వ్య‌వ‌హారాన్ని తెర మీద‌కు తీసుకొచ్చింది.. యూపీఏ స‌ర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

మ‌రి.. ఈ రోజు ఏమైంది..? స‌్కాంలో ఆరోప‌ణలు వెల్లువెత్తి.. జైల్లో కొంత కాలం గ‌డిపి నిందితులన్న ముద్ర ప‌డిన మాజీ కేంద్ర‌మంత్రి రాజా.. క‌రుణానిధి కుమార్తె క‌నిమొళి ఇద్ద‌రూ సుద్ద‌పూస‌లు మాదిరి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. యూపీఏకు మిత్ర‌ప‌క్షంగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా త‌మ పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రి ప‌ద‌వి కోల్పోయి జైల్లోకి వెళ్ల‌టం ఒక ఎత్తు అయితే.. డీఎంకే అధినేత కుమార్తె క‌నిమొళి కూడా ఈ కేసులో భాగంగా జైలుపాలు కావాల్సి వ‌చ్చింది. సొంత ప్ర‌భుత్వం హ‌యాంలో జైల్లోకి వెళ్లి వ‌చ్చిన వీరు.. ఇప్పుడు కేంద్రంలో మోడీ స‌ర్కారు ప‌వ‌ర్లో ఉన్న వేళ‌.. నిర్దోషులుగా విడుద‌ల కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అమ్మ జ‌య‌ల‌లిత ప్రాతినిధ్యం వ‌హించిన ఆర్కేన‌గ‌ర్ స్థానానికి ఉప ఎన్నిక‌ల్లో  కీల‌క‌మైన పోలింగ్ వేళ తీర్పు రావ‌టం డీఎంకే వ‌ర్గాలు ఫుల్ ఖుష్ అయ్యాయి. ఒక‌ర‌కంగా చూస్తే వాళ్ల‌కు డ‌బుల్ థ‌మాకా. కోర్టు తీర్పు పాజిటివ్ గా మారి.. ఓట‌ర్ల మీద ఎంతోకొంత ప్ర‌భావం చూపుతుంద‌న‌టంలో సందేహం లేదు. సో.. డీఎంకే వారంతా హ్యాపీ.

ఇన్నేళ్లుగా సాగుతున్న తీర్పును ఎలాంటి ప్ర‌భావాలు లేకుండా చేయ‌గ‌లిగామ‌న్న తృప్తితో మోడీ స‌ర్కార్ హ్యాపీ కావొచ్చు. ఎన్నో వేల ప్ర‌తుల్ని ప‌రిశీలించి.. న్యాయాన్ని.. ధ‌ర్మాన్ని తూచా త‌ప్ప‌కుండా కేసు తీర్పు ఇచ్చినందుకు కోర్టుకు.. ఒక కేసు భారం త‌గ్గిపోయింద‌న్న హ్యాపీ ఉండొచ్చు. ఇక‌.. అరిగిపోయిన టేపు మాదిరి అదే ప‌నిగా 2జీ.. 2జీ అంటూ ఇప్పుడా కేసును వ‌దిలేసి.. కొత్త కేసుల మీద ఫోక‌స్ చేసుకోవ‌చ్చు. ఆందుకు మీడియా కూడా హ్యాపీ. ఇలా ఎవ‌రికి వారికి.. అవ‌స‌ర‌మైన హ్యాపీ అంతా దొరికిపోయిన‌ట్లే.కాకుంటే.. ఇబ్బంది అంతా అమాయ‌క‌పు పిచ్చ జ‌నాల‌దే.  స్కాం బ‌య‌టకు రాగానే ఆవేశంతో చొక్కాలు చించుకొని.. గుండెలు బాదేసుకున్న వారికి. ప్ర‌జాధ‌నాన్ని దోచేసుకునే వారికి జైలుశిక్ష త‌ప్ప‌ద‌ని అన‌వ‌స‌ర‌మైన భ్రాంతుల‌కు గురైన వారికే అస‌లు ఇబ్బందంతా.  ప్ర‌జాస్వామ్య భారతంలో స‌గ‌టుజీవికి.. ఏదో శ‌శిక‌ళ లాంటి కొంద‌రి విష‌యంలోనే.. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూపోయేది.
Tags:    

Similar News