బర్త్ రైట్ సిటిజన్ షిప్.. అమెరికా సరే.. మిగతా దేశాల్లో ఎలా ఉంది?

ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపరుస్తున్న అంశం.. ‘‘జన్మతః అమెరికా పౌరసత్వ హక్కు రద్దు’’. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి అమెరికా వెళ్లినవారుంటారు

Update: 2025-01-24 19:30 GMT

ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపరుస్తున్న అంశం.. ‘‘జన్మతః అమెరికా పౌరసత్వ హక్కు రద్దు’’. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి అమెరికా వెళ్లినవారుంటారు. డాలర్ డ్రీమ్స్ కానివ్వండి.. మెరుగైన విద్య, ఉద్యోగం, ఉపాధి కానివ్వండి.. అగ్ర రాజ్యం అమెరికా అంటే అందరికీ మోజు. అలా దశాబ్దాల కిందటే వెళ్లి.. స్థిరపడిన వివిధ దేశాల వారితో అమెరికా సంపన్నంగా ఎదిగింది.

అసలు అమెరికా అంటేనే అన్ని దేశాల కలయిక అంటారు. అయితే, జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు ఇలాంటివారిలో కలకలం రేపాయి. ట్రంప్ ఉత్తర్వులను అమెరికా కోర్టు నిలిపివేసినా.. ఆందోళన మాత్రం తగ్గడం లేదు. అప్పీల్‌ కు వెళ్లాలని ట్రంప్‌ నిర్ణయించడమే దీనికి కారణం.

జన్మతః దక్కే పౌరసత్వం విషయంలో ఒక్కో దేశం ఒక్కో విధానాలు పాటిస్తున్నాయి. తమ గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికీ అక్కడి పౌరసత్వం దక్కేలా అమెరికా 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగం హక్కు కల్పించింది. అయితే, రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ తో దీనిని రద్దు చేశారు ట్రంప్.

పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్‌ రైట్‌ సిటిజన్‌ షిప్‌. తల్లిదండ్రుల జాతీయత.. (వాళ్లది ఏ దేశం), ఇమ్మిగ్రేషన్‌ స్టేటస్‌ (ఏ రకంగా వలస వచ్చారు) ఏమీ పరిగణనలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వం గుర్తింపు ఇస్తున్నారు.

రెండు విధాలుగా

ప్రపంచంలో ప్రస్తుతం ‘‘జస్ సాన్‌ గ్యుఇనిస్, జస్ సోలి’’ అనే రెండు సిద్ధాంతాల ఆధారంగా పౌరసత్వం ఇస్తున్నారు. ఎక్కువ దేశాలు ‘‘జస్ సాన్‌ గ్యుఇనిస్’’నే పాటిస్తున్నాయి. దీనిప్రకారం వారసత్వంగా (రక్తసంబంధంతో) పౌరసత్వం. జస్ సోలి అంటే.. ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వం లభించడం.

డిమాండ్ రీత్యా అమెరికాను మాత్రమే చెప్పుకొంటున్నాం కానీ.. అమెరికా మాత్రమే కాదు.. మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలిని వర్తింపజేస్తున్నాయి. అమెరికా పొరుగున ఉండే కెనడా కూడా ఇలానే. కాగా అమెరికాలోలానే ఇక్కడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలా దేశాలే ఈ జాబితాలో ఉన్నాయి. చిలీ, కంబోడియా మాత్రం జస్ సాన్‌గ్యుఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందిస్తున్నాయి.

యూరప్‌, ఆసియా, ఆఫ్రికాలలో చాలా దేశాలు జస్ సాన్‌ గ్యుఇనిస్ మీదే పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్‌ తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లు (ప్రస్తుతం 8) జీవించి ఉండాలి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే.. కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి.

భారత్ జస్ సాన్‌ గ్యుఇని అనుసరిస్తోంది. వారసత్వంగా రక్త సంబంధీకులకు పౌరసత్వం వర్తిస్తుంది. 1928లో మోతిలాల్‌ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. జస్‌ సోలిని వర్తింపజేయాలని ప్రతిపాదించింది. 1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కానీ, వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం.. జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి. మరొకరు చట్టపరంగా వలసదారు అయితే సరిపోతుంది.

జపాన్‌ లో ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్‌ లో పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి కచ్చితంగా పౌరసత్వం ఉండాలి. లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి.

ఇటలీలో పేరెంట్స్‌ లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి. లేదంటే.. ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మలేషియా.. ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండడ్రులు కచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసుతులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది.

Tags:    

Similar News