బ్యాంకుల‌కు క‌నిష్క్ గోల్డ్ వెయ్యి కోట్లు టోపీ

Update: 2018-03-22 04:54 GMT
మీ డ‌బ్బుల‌తో డీడీ తీసుకునేందుకు సైతం స‌వాల‌చ్చ రూల్స్ చెప్పే బ్యాంకులు.. కొన్ని వ్యాపార సంస్థ‌ల‌కు.. బ‌డా బాబుల‌కు వేలాది కోట్లు ఎంత అప్ప‌నంగా ఇస్తాయో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ మ‌ధ్య‌న లిక్క‌ర్ కింగ్ గా పిలుచుకునే విజ‌య్ మాల్యా.. ఈ మ‌ధ్య‌నే వెలుగులోకి వ‌చ్చిన నీర‌వ్ మోడీ బాట‌లో మ‌రో భారీ కుంభ‌కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌నిష్క్ గోల్డ్ పేరుతో బంగారు వ్యాపారం చేసే సంస్థ‌.. బ్యాంకుల‌కు రూ.వెయ్యి కోట్లు టోపీ పెట్టేసి.. విదేశాల‌కు చెక్కేసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలో ఎప్ప‌టిమాదిరే బ్యాంకులు ఉదారంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. అప్పు ఎగ్గొట్టి దేశం విడిచి జంప్ అయిన వైనం చూస్తే.. అధికార వ్య‌వ‌స్థ‌లు.. నిఘా వ‌ర్గాలు ఎంత బాగా ప‌ని చేస్తున్నాయో ఇట్టే అర్థం కాక‌మాన‌దు.

ఎస్ బీఐతో స‌హా 14 జాతీయ బ్యాంకుల‌కు రూ.825 కోట్ల మేర అప్పులు తీసుకొని ఎగ్గొట్టింది.వ‌డ్డీతో స‌హా ఈ మొత్తం రూ.వెయ్యి కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు. క‌నిష్క్ గోల్డ్ కు అప్పులు ఇచ్చి.. వారు రీపేమెంట్ చేయ‌క‌పోవ‌టంతో సీబీఐకి ఫిర్యాదు చేసింది ఎస్ బీఐ. అయితే.. అప్ప‌టికే అప్పులు తీసుకున్న అసామి.. పెళ్లాం బిడ్డ‌ల‌తో స‌హా మారిష‌స్ జంప్ అయిపోవ‌టం గ‌మ‌నార్హం.

నీర‌వ్ మోడీ స్కాం సృష్టించిన క‌ల‌క‌లం ఒక కొలిక్కి రాక ముందే క‌నిష్క్ గోల్డ్  వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. చెన్నైలోని ఈ సంస్థ ప్ర‌మోట‌ర్ల ఇళ్లు.. కార్యాల‌యాలు.. షోరూమ్ ల‌పై సోదాలు నిర్వ‌హిస్తున్న అధికారులు అంతా అయిపోయాక స్పందించిన రీతిలో ఉంద‌న్న మాట వినిపిస్తోంది. రికార్డుల మాయ‌తో బ్యాంకును ఏమార్చి ఎడాపెడా రుణాల్ని తీసుకున్న ఈ సంస్థ‌పై మోసం నేరంపై కేసు న‌మోదు చేశారు.

త‌మిళ‌నాడుతో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌నిష్క్ గోల్డ్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేది. వ‌ర్కింగ్ కేపిట‌ల్ రుణాలు.. ట‌ర్మ్ లోన్స్ తో పాటు మెట‌ల్ గోల్డ్ లోన్ రూపంలో బ్యాంకు ల‌నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న క‌నిష్క్ ఆ త‌ర్వాత బ్యాంకుల‌కు టోపీ పెట్టేసింది.

క‌నిష్క్‌కు అప్పులు ఇచ్చిన 14 బ్యాంకుల్లో ఎస్ బీఐదే ముఖ్య‌మైన‌ది. ఎస్ బీఐ ఒక్క‌టే ఈ సంస్థ‌కు దాదాపు రూ.215 కోట్లు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. యూనియ‌న్ బ్యాంకు.. సిండికేట్ బ్యాంకు రూ.50 కోట్ల చొప్పున‌.. బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఐడిబిఐ.. యూకో బ్యాంకు.. త‌మిళ‌నాడు మ‌ర్కెంటైల్ బ్యాంక్.. ఆంద్రా బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా.. హెచ్ డిఎఫ్ సి.. ఐసీఐసీఐ.. సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..కార్పొరేష‌న్ బ్యాంకులు క‌నిష్క్ కు అప్పులు ఇచ్చాయి.

ఎస్ బిఐ నివేదిక ప్ర‌కారం గ‌త ఏడాది మార్చిలో తొలిసారి క‌నిష్క్ డిఫాల్ట్ అయ్యింది. క‌న్సార్టియంలోని 8 బ్యాంకుల‌కు రుణాలు చెల్లించ‌టం ఆపేసింది. వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌కు సంబంధించిన రుణాలకు చెందిన స్టాక్ ను ఆఇట్ చేసేందుకు వెళ్లిన అధికారుల‌కు సంస్థ కార్యాల‌యానికి తాళం వేసి ఉండ‌టాన్ని గుర్తించారు.అప్ప‌టి నుంచి జైన్ దంప‌తుల‌ను సంప్ర‌దించేందుకు సీబీఐ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. మోసం చేయ‌ట‌మే కాదు.. తాను బ్యాంకుల‌ను బోల్తా కొట్టించిన వైనాన్ని జైన్ అంగీక‌రించాడు. రికార్డుల్ని తాను తారుమారు చేసిన‌ట్లు అంగీక‌రించిన ఆయ‌న‌.. క‌నిష్క్ సంస్థ పూర్తి న‌ష్టాల్లో ఉంద‌ని.. దీంతో వ్యాపారాల్ని ఆపేసిన‌ట్లు పేర్కొన్నారు. వంద‌లాది కోట్ల రూపాయిల రుణాలిచ్చిన సంస్థ‌ల బాగోగులు బ్యాంకుల‌కు ప‌ట్ట‌వా?  వెయ్యి.. రెండు వేల రూపాయిల విష‌యంలో నిబంధ‌న‌ల్ని నిక్క‌చ్చిగా అమ‌లు చేసే అధికారులు వంద‌లాది కోట్లు అప్పులు ఇచ్చిన వారి విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టించుకోరా? అన్న సందేహాలు క‌నిష్క్ వ్య‌వ‌హారంలో మ‌రోసారి రాక మాన‌దు.
Tags:    

Similar News