నిప్పుకు చెద‌.. రాజకీయ మరకలతో మసకబారిన సీబీఐ!!

Update: 2021-01-16 02:30 GMT
నిప్పు లాంటి సంస్థ‌గా పేరున్న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌(సీబీఐ)కు కూడా అవినీతి మ‌కిలి అంటేసింది. నిజానికి సీబీఐ అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు.. జేడీ(జాయింట్ డైరెక్ట‌ర్‌) ల‌క్ష్మీనారాయ‌ణ‌. చాలా నిజాయితీగా వ్య‌వ‌హ‌రించార‌నే పేరుంది. అయితే.. ఈయ‌న ఒక్క‌రే కాదు.. చాలా మంది సీబీఐకి వ‌న్నెతెచ్చిన అధికారులు ఉన్నారు. నేర‌స్తులు ఎంత‌టి వారైనా.. ఎలాంటి వారైనా.. నిష్పాక్షికంగా ద‌ర్యాప్తు చేయ‌డం, నిజాలు నిగ్గు తేల్చ‌డం.. ఎలాంటి ప్ర‌లోభాలకూ లొంగ‌క పోవ‌డం వంటివి ఇలాంటి అధికారుల‌ను దేశ‌వ్యాప్తంగా హీరోల‌ను చేసింది. అదేస‌మ‌యంలో సీబీఐ అంటేనే `ఉన్న‌త స్థాయి` నేర‌స్తుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించేలా చేసింది.

బ‌హుశ అందుకేనేమో.. దేశంలో ఎక్క‌డ ఎలాంటి పెద్ద నేరం జ‌రిగినా.. ఇప్ప‌టికీ సీబీఐ వేయాల‌నే డిమాం డ్లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. అయితే.. అలాంటి సంస్థపై కొన్ని సంవత్స‌రాలు.. ఒక వివాదం వినిపిస్తూనే ఉంది. కేంద్రం పెద్ద‌ల‌కు సీబీఐ త‌లొగ్గుతోంద‌ని!  గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అనేక కేసులు న‌మోదు కావ‌డం.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు జైళ్లు పాల‌వ‌డం.. వంటివి దీనిలో భాగ‌మ‌నే ప్ర‌చారం ఉంది. స‌రే.. దీనిలో నిజాలు.. అబ‌ద్ధాలు.. ఆరోప‌ణ‌లు.. అనేవి కొన్నాళ్లు హ‌ల్ చ‌ల్ చేసినా.. సీబీఐపై మాత్రం దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు, సంస్థ‌ల‌కు కూడా న‌మ్మ‌కం ఉంది. ఈ క్ర‌మంలోనే సీబీఐ అంటే.. నిప్పులాంటి సంస్థ అనే పేరు వ‌చ్చింది.

కానీ, ఇప్పుడు ఇలాంటి సంస్థ‌కు చెద‌ప‌ట్టింది. ఉన్న‌త స్థాయిలో జ‌రిగే అవినీతిని, అక్ర‌మాల‌ను వెలికి తీయాల్సిన సీబీఐ అధికారులే అవినీతి పాల్ప‌డ‌డం, లంచాల‌కు మ‌ర‌గడం.. ఇప్పుడుదేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో.. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయ‌లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన కంపెనీల బాగోతం నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన సీబీఐ.. అధికారుల్లో కొంద‌రు.. మోసాల‌కు పాల్ప‌డిన కంపెనీల‌కు కొమ్ముకాశారు. ఆయా కంపెనీల నుంచి భారీ ఎత్తున లంచాలు మేసేశారు. ఫ‌లితంగా .. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల విష‌యంలో న‌కిలీ ప‌త్రాలు సృష్టించి.. అస‌లు త‌ప్పే జ‌ర‌గ‌లేద‌న్న‌ట్టు నివేదిక రూపొందించారు.

ఈ నివేదిక‌ను చూసిన ఆర్బీఐ.. కొన్ని అనుమానాలు వ్య‌క్తం చేస్తూ.. సీబీఐకి మ‌ళ్లీ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్న‌తాధికారులు.. అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై దృష్టిసారించారు. ఈ క్ర‌మంలో వారికి సంచ‌ల‌న విష‌యాలు దృష్టికి వ‌చ్చాయి. ఇద్దరు డీఎస్పీలు సహా సీబీఐకి చెందిన నలుగురు అధికారులు లంచాలు మేసి.. మోసాల‌కు కొమ్ముకాశార‌నే విష‌యం నిగ్గు తేలింది. దీంతో వారిని అరెస్టు చేశారు. వాస్త‌వానికి దీనిని చిన్న అంశంగాప‌రిగ‌ణించాల్సిన వీలు లేద‌ని అంటున్నారు సీబీఐలో రిటైర్ అయిన అధికారులు అంటున్నారు.

ప్ర‌జ‌ల‌ నుంచి దేశంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల వ‌ర‌కు సీబీఐ ఒక్క‌టే.. దిక్సూచిగా ఉన్న  ఉన్న‌త‌స్థాయి సంస్థలోనే ఇలాంటి జ‌ర‌గ‌డం దారుణ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం వెలుగు చూసింది ఒక్క‌టే కాదు.. గ‌తంలోనూ  బిహార్‌, మ‌హారాష్ట్ర‌ల్లో.. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ ఉన్న‌తాధికారులు.. అవినీతికి పాల్ప‌డి.. కింది స్థాయి అధికారులకు చిక్కిన విష‌యం అప్ప‌ట్లో నూ ఇలానే సంచ‌ల‌నం సృష్టించింది. అయిన‌ప్ప‌టికీ.. మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్య‌వ‌స్థ‌ల‌ను కాపాడేదెవ‌రు?!
Tags:    

Similar News