జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై సీబీఐది వితండ వాద‌నేనా?

Update: 2017-03-29 08:33 GMT
సీబీఐ... సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ పేరిట ఏర్పాటు చేసిన ఈ జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌కు గతంలో ఎంతో పేరు ప్ర‌తిష్ఠ ఉండేది. సీబీఐ కేసు దాఖ‌లు చేసిందంటే... ఇక ఆ వ్య‌క్తి ప‌ని అయిపోయిన‌ట్లేన‌న్న వాద‌న కూడా ఉండేది. సీబీఐ ఆఫీస‌ర్లు వ‌స్తున్నారంటే అవినీతిప‌రుల్లోనే కాకుండా క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తులు కూడా జ‌డుసుకుని చ‌చ్చేవారు. అలాంటిది ఇప్పుడు సీబీఐ పేరు వింటేనే... ఇక ఈ కేసు తేలదులే అన్న భావ‌న స‌ర్వ‌త్ర‌ వ్య‌క్త‌మ‌వుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాఖ‌లు చేసిన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఆ సంస్థ ప‌రువు మ‌రింత‌గా దిగ‌జారింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. కేవ‌లం విచార‌ణ నిమిత్తం జ‌గ‌న్‌ను త‌న కార్యాల‌యానికి పిలిపించిన నాటి సీబీఐ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ అప్ప‌టిక‌ప్పుడు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత విచార‌ణలో జోక్యం చేసుకుంటార‌న్న ఒకే ఒక్క కార‌ణం చూపి జ‌గ‌న్‌ను ఏకంగా 16 నెల‌ల పాటు జైలులో ఉండేలా చేశారు.

ఎలాగైతేనేం.. సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన జ‌గ‌న్‌... చివ‌ర‌కు బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. నాడు చంచ‌ల్ గూడ జైలు నుంచి జ‌గ‌న్ విడుద‌లైన సంద‌ర్భంగా జైలు నుంచి జగ‌న్ ఇంటిదాకా జ‌రిగిన భారీ ర్యాలీకి ఒక్క లోక‌ల్ ఛానెళ్లే కాకుండా జాతీయ న్యూస్ ఛానెళ్లు కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌సారం చేశాయి. జ‌గ‌న్ విడుద‌లై ఇప్ప‌టికే మూడేళ్లు దాటిపోతోంది. అయితే ఈ మూడేళ్ల‌లో జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ సీబీఐ ఏనాడు కోరుకోలేదు. ఎందుకంటే... ఓ రాజ‌కీయ పార్టీకి అధినేత‌గా ఉంటూ, ఏపీలో విప‌క్ష నేత హోదాలో ఉన్న జ‌గ‌న్‌... కోర్టు సూచ‌న‌ల మేర‌కు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతూనే... త‌న ప‌రిధి దాట‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అస‌లు వేరే ఎవ‌రైనా ప్ర‌స్తావిస్తే త‌ప్పించి ఆయ‌న ఈ కేసుల‌పై నోరు విప్ప‌డం లేదు. అంతేకాకుండా కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క‌రిని కూడా జ‌గ‌న్ క‌లిసిన దాఖ‌లా ఇప్ప‌టిదాకా లేద‌నే చెప్పాలి.

అయితే నిన్న అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ సీబీఐ... నాంప‌ల్లిలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఓ వింత పిటిష‌న్‌ను దాఖ‌లు చేసింది. జ‌గ‌న్‌కు ఇచ్చిన బెయిల్‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలంటూ ఆ పిటిష‌న్‌లో సీబీఐ వాదించింది. త‌న వాద‌న‌కు ఆధారాలివేనంటూ సీబీఐ ఓ వాద‌న‌ను కూడా వినిపించింది. ఈ వాద‌న వింటే నిజంగా సీబీఐ ఇంత సిల్లీ వాద‌న‌లు కూడా చేస్తుందా? అన్న భావ‌న క‌ల‌గ‌క‌మాన‌దు. సీబీఐ చెప్పిన కార‌ణ‌మేంటంటే... జ‌గ‌న్ త‌న కేసులో సాక్షులుగా ఉన్న వారిని ప్ర‌భావితం చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి రాష్ట్ర ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన ర‌మాకాంత్ రెడ్డి ఓ టీవీ చానెల్‌కు వ‌చ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లే... సాక్షుల‌ను జ‌గ‌న్ ప్ర‌భావితం చేస్తున్నార‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని కూడా సీబీఐ త‌న వాద‌న‌ను వినిపించింది.

అయినా ర‌మాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ప‌రిశీలిస్తే... జ‌గ‌న్‌పై న‌మోదైన కేసులు ఏమాత్రం నిల‌బ‌డ‌వ‌ని, ఈ విష‌యాన్ని తాను గ‌తంలోనే సీబీఐ అధికారుల‌కు చెప్పాన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యున్న‌త స‌ర్వీసు అయిన ఐఏఎస్‌గా సుదీర్ఘ కాలం పాటు సేవ‌లందించిన ర‌మాకాంత్ రెడ్డికి అస‌లు జ‌గ‌న్ కేసుల‌తో ఏమాత్రం సంబంధం లేదు. అయితే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నందున ఆయ‌న‌ను కూడా సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు. త‌న‌ను సీబీఐ విచారించిన తీరును కూడా ర‌మాకాంత్ రెడ్డి స‌ద‌రు ఇంట‌ర్వ్యూలో స‌వివ‌రంగానే చెప్పేశారు. అయినా ర‌మాకాంత్ రెడ్డి ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా చ‌ట్టాల‌పై త‌న‌కున్న ప‌రిజ్ఞానం మేర‌కు... జ‌గ‌న్ పై న‌మోదైన కేసులు ఏమాత్రం నిల‌బ‌డ‌వ‌ని చెప్పారు. ర‌మాకాంత్ రెడ్డి వాద‌న‌లో నిజ‌ముంద‌న్న విష‌యాన్ని దాదాపుగా అన్ని వ‌ర్గాల వారు గుర్తించారు కూడా.

ఇదే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రగ‌గా... జ‌గ‌న్‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసులేమీ నిల‌బ‌డ‌వ‌న్న మాటే గ‌ట్టిగా వినిపించింది. మ‌రి ఇదే విష‌యం సీబీఐకి కూడా గుర్తుకు వ‌చ్చిందేమే తెలియ‌దు గానీ... ఉన్న‌ట్లుండి జగ‌న్‌కు ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ కోర్టును ఆశ్ర‌యించిన‌ట్టుగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. సాధార‌ణంగా ఎవ‌రు పిటిష‌న్ వేసినా... ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ చేస్తున్న క్ర‌మంలో సీబీఐ పిటిష‌న్ విష‌యంలోనూ కోర్టు జ‌గ‌న్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల‌కు జ‌గ‌న్ స్పందించడం ఖాయ‌మే. వ‌చ్చే నెల 7న జ‌ర‌గ‌నున్న విచార‌ణ సంద‌ర్భంగా సీబీఐకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటే... కోర్టు ఎదుట ద‌ర్యాప్తు సంస్థ‌లు ప‌క్కా ఆధారాలు చూపాలి. మ‌రి సీబీఐ చూపుతున్న ర‌మాకాంత్ రెడ్డి వ్యాఖ్య‌ల బూచి కోర్టు బోనులో నిల‌బ‌డ‌ద‌ని, సీబీఐ వాద‌న తేలిపోవ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News