కుప్పంలో చంద్రబాబు చరిష్మా నిలుస్తుందా? వైసీపీ అధికారం పనిచేస్తుందా?

Update: 2021-10-24 03:30 GMT
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా అధికార, ప్రతిపక్షాలు తలపడబోతున్నాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి టీడీపీని దెబ్బకొట్టాలని అధికార పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని టీడీపీకి వైసీపీ సవాల్ విసిరింది. కుప్పంలో కూడా టీడీపీని క్లీన్ చిప్ చేయాలని వైసీపీ నేతలు ఊవ్విల్లూరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నికల్లో కూడా టీడీపీ సత్తా చూపలేక పోవడం అటుంచి.. గట్టి పోటీ కూడా ఇవ్వలేదు. కుప్పంలో గెలిచి పరువు దక్కించుకోవాలని టీడీపీ.. ఇక్కడే గెలిచి చంద్రబాబును దెబ్బతీయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

మేజర్‌ పంచాయతీగా ఉన్న కుప్పం పంచాయతీని 2019 డిసెంబరులో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. 25 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీలతో పాటు కుప్పంలో కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే పన్నుల భారం భరించలేమంటూ గుట్టపల్లి, లక్ష్మిపురం, దళవాయి కొత్తపల్లె గ్రామాల రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలైంది. ఈ నెలాఖరులోనో లేకుంటే వచ్చే నెల మొదటి వారంలోనో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. దీంతో కుప్పంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కుప్పంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ  దృష్టిపెట్టడంతో  రాజకీయ పార్టీల్లో కదలికలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు, ఎంపీ మిథున్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఇక టీడీపీ నేతలు కూడా ఓ ముఖ్య నేతతో ఎన్నికలపై సమాలోచనలు చేస్తున్నారు.

కుప్పం నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేసే వారు మున్సిపల్ చైర్ పర్సన్  అభ్యర్థిని వైసీపీ ముందే ఖారారు చేసింది. ఆ అభ్యర్థులు రెండు నెలలుగా కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కుప్పంలో టీడీపీని ఓడించి తమ సత్తా చూపాలని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నారు. చంద్రబాబు పీఠాన్ని కదపాలని వైసీపీ అనుకుంటోంది. ఇదే నియోజకవర్గంలో పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీపై చేయి సాధించింది. అయితే కుప్పం మున్సిపాలిటీ దక్కించుకుని టీడీపీని దెబ్బకొట్టాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కుప్పంలో విజయం సాధించి వైసీపీకి ధీటుగా సమాధానం చెప్పాలని టీడీపీ భావిస్తోంది. అందువల్ల ఆ పార్టీ ఈ ఎన్నికను టీడీపీ అంత్యంత ప్రతిష్టాత్మకం కూడా.

ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించాలని అనుకున్నారు. అయితే తుఫాను కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి కుప్పంలో అడుగుపెట్టేందుకు చంద్రబాబు షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. అధినేత పర్యటనతో తమ్ముళ్లు ఉత్సాహంతో ఉన్నారు.

అధినేత కూడా కుప్పం వస్తుండడంతో ఆయన గెలుపు రహస్యం చెబుతారని ఆపార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ పంచాయతీలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. అయితే కుప్పంలో 89 గ్రామ పంచాయతీల్లో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. దీనిపై చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య పెద్ద దుమారమే రేగింది. కుప్పంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. మరి కుప్పంలో చంద్రబాబు చరిష్మా నిలుస్తుందా? వైసీపీ అధికారం పనిచేస్తుందా అనేది త్వరలోనే తేలిపోనుంది.
Tags:    

Similar News