అవును.. బ్యాట‌రీ లేని సెల్ ఫోన్ రానుంది

Update: 2017-07-06 16:20 GMT
బ‌త‌క‌టానికి మ‌నిషికి  గాలి పీల్చ‌టం.. నీళ్లు తాగ‌టం ఎంత అవ‌స‌ర‌మో సెల్ ఫోన్ ఉండ‌టం కూడా అంతే అవ‌స‌రంగా మారింది. జేబులో ప‌ర్సు మ‌ర్చిపోయినా ఫ‌ర్లేదు కానీ.. సెల్ ఫోన్ లేకుంటే భ‌యంతో వ‌ణికిపోయే ప‌రిస్థితి. అంత‌లా మ‌నిషి జీవితంలోకి భాగ‌మైపోయింది సెల్‌. అలాంటి సెల్ ప్ర‌పంచంలో స‌రికొత్త సంచ‌ల‌నం ఒక‌టి చోటు చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న సెల్ ఆవిష్క‌ర‌ణ‌కు భిన్న‌మైన ఆవిష్క‌ర‌ణ‌గా దీన్ని చెప్పొచ్చు.

సెల్ ఫోన్ ను బ‌తికి ఉంచే బ్యాట‌రీ అవ‌స‌రం లేని కొత్త ఆవిష్క‌ర‌ణ‌ను శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. సెల్ ఫోన్ వాడే ప్ర‌తిఒక్క‌రూ బ్యాట‌రీ  ఛార్జింగ్ అయిపోతుంద‌ని ఫీలైపోతుంటారు.  ఛార్జింగ్ త‌గ్గిపోయే కొద్దీ విప‌రీత‌మైన టెన్ష‌న్‌కు గురి అవుతుంటారు. అయితే.. అలాంటి ఇబ్బందులేమీ లేకుండా.. అస‌లు బ్యాట‌రీ అవ‌స‌రం లేకుండా ప‌ని చేసే సెల్‌ను సైంటిస్ట్ లు క‌నుగొన్నారు.

తాజా ఆవిష్క‌ర‌ణ సెల్ ఫోన్ రంగంలో ప్ర‌కంప‌న‌లు పుట్టించ‌ట‌మే కాదు.. సెల్ ఫోన్ స్వ‌రూపాన్నే మార్చేసే వీలు ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ ఈ తాజా ఆవిష్క‌ర‌ణ‌లో క‌నుగొన్న సెల్ ఎలా ప‌ని చేస్తుంది? దానికి అవ‌స‌ర‌మైన విద్యుత్‌ను ఎలా స‌మ‌కూర్చుకుంటుంద‌న్న ప్ర‌శ్న‌కు చెబుతున్న స‌మాధానం ఏమిటంటే.. సెల్ ఫోన్ ప‌రిస‌రాల్లో ఉన్న రేడియో సిగ్న‌ళ్లు.. కాంతి నుంచి త‌న‌కు అవ‌స‌ర‌మైన విద్యుత్ ను గ్ర‌హిస్తుంది. తాజాగా సైంటిస్టులు క‌నుగొన్న బ్యాట‌రీ లేని ఫోన్ లో స్కైప్ లో వీడియో కాల్ కూడా చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

జీరో ప‌వ‌ర్ తో ప‌ని చేసే సెల్ ను మొట్ట‌మొద‌టిసారి తాము ఆవిష్క‌రించిన‌ట్లుగా వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ శ్యామ్ గొల్ల‌కోట పేర్కొన్నారు. ఫోన్ మాట్లాడే స‌మ‌యంలో మైక్రోఫోన్‌.. స్పీక‌ర్ ద్వారా వ‌చ్చే చిన్న‌పాటి కంప‌నాల‌ను సైతం త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటుంద‌ని చెబుతున్నారు. బ్యాట‌రీ లేని ఫోన్ ద్వారా ఇన్ క‌మింగ్ కాల్స్ తో పాటు అవుట్ గోయింగ్ కాల్స్‌ ను చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. అయితే.. దీన్ని పూర్తిస్థాయి వాణిజ్య ఫోన్ గా రూపొందించేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. కొన్ని సంక్లిష్ట‌త‌ల్ని అధిగ‌మించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఒక‌ట్రెండు సంవ‌త్స‌రాలు లేటైనా.. బ్యాట‌రీ లెస్ సెల్ ఫోన్ ఈ రంగంలో సునామీ మాదిరి మారి.. సెల్ స్వ‌రూపాన్ని మొత్తంగా మార్చేయ‌టం ఖాయ‌మ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News