బిగ్ సేల్స్..బిగ్ షాక్! అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్రం దిమ్మతిరిగే పంచ్..

Update: 2020-10-17 08:50 GMT
పండుగల సేల్ లో హడావుడిగా ఉన్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. వస్తువుల అమ్మకాల్లో నిబంధనలు పాటించని కారణంగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. దసరా, దీపావళి మనదేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగలు. దసరా నవరాత్రి ఉత్సవాలు పది రోజులు వైభవంగా జరుగుతాయి. దీపావళి వేడుకలు కూడా మూడు రోజుల పాటు జరుగుతాయి. పండుగల సంబరాన ఇంటిల్లిపాదికి దుస్తులు, ఇతర సామాగ్రి కోసం జనం ఇప్పటి నుంచే షాపింగ్ చేస్తున్నారు.

దసరా వస్తే చాలు ఇంట్లోకి టీవీనో, ఫ్రిజ్ నో కొనడం జనానికి ఆనవాయితీ. ఎందుకంటే ఈ సీజన్లో మొదటి నుంచి వ్యాపార సంస్థలు భారీ ఆఫర్లతో వస్తువుల అమ్మకాలు చేపడుతున్నాయి. వ్యాపారం అంతా ఇప్పుడు ఈ కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల ద్వారానే నడుస్తోంది. ఇప్పుడు ఆ సంస్థలు జనాన్ని ఆకట్టుకోవడానికి డిస్కౌంట్ సేల్ ప్రకటించాయి. ఫ్లిప్ కార్ట్ 16 వ తేదీ నుంచి 21 వరకు డిస్కౌంట్ సేల్ ప్రకటించగా, అమెజాన్ కూడా ఇవాల్టి నుంచి పండుగ సేల్ మొదలు పెట్టనుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి ఒకరోజు ముందే డిస్కౌంట్ సేల్ మొదలైంది.

ఈ రెండు సంస్థలు జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రచార హోరులో నిమగ్నమై ఉండగా ఈ రెండు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒక వస్తువును అమ్మడానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన మూలం, ఏ దేశంలో తయారైందన్న విషయాన్ని వినియోగదారుడికి తెలియజేయాలన్న తప్పనిసరి నిబంధనను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ విస్మరించాయని కేంద్రం ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. అతి పెద్ద పండగల సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ-కామర్స్ సంస్థలు దిమ్మ తిరిగి పోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలను అమలు చేసేందుకు ఆ సంస్థలు సిద్ధమవుతున్నాయి.
Tags:    

Similar News