ఎన్నారైలకు తీపికబురు చెప్పిన ఈసీ.. ఓటు వేసేందుకు తొలి అడుగు

Update: 2022-04-23 05:07 GMT
ఏళ్లకు ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్ ఎట్టకేలకు మోక్షం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో నివిస్తున్న ప్రవాస భారతీయులు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే ఎంతో చర్చ జరిగినా.. ఆ దిశగా అడుగు మాత్రం పడని పరిస్థితి. ఇలాంటి వేళ.. విదేశాల్లోని ఎన్నారైలకు ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు వేసేందుకు వీలుగా సౌకర్యాన్ని కల్పిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ప్రస్తుతానికి ఓటర్లుగా నమోదు చేసుకున్న ఎన్నారైల సంఖ్య చాలా తక్కువగా ఉందని.. తాజా నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుతం ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషననర్ సుశీల్ చంద్ర తన విదేశీ పర్యటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తన అధికారిక పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా.. మారిషస్ లకు వెళ్లారు.

ఆ సందర్భంగా ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయుల్ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించాలన్న అభ్యర్థనపై స్పందించిన ఆయన.. ప్రవాస భారతీయులకు ఈ ఓట్లు వేసే సౌకర్యాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రవాస భారతీయుల్లో కేవలం 1.2 లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారని.. మిగిలిన వారు చేసుకోవాలని కోరారు.

ఇప్పటివరకు సర్వీసు ఓటర్లు (సైన్యం, సాయుధ బలగాల్లో పని చేసేవారు) కు ఈ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తారు. ఒక ఉద్యోగి తనకు ఓటుహక్కు ఉన్న నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులకు ఓటు వేసే సౌకర్యం ఉంది. ఇదే విధానాన్ని ప్రవాస భారతీయులకు కూడా అమలు చేయనున్నట్లుగా ఆయన చెప్పారు.

విదేశాల్లో ఉన్న ప్రవాసీయులే కాదు.. రాయబార కార్యాలయాల్లో పని చేసే సిబ్బందికి కూడా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. సర్వీసు ఓటర్ల విషయంలో అనుసరిస్తున్న విధానం సక్సెస్ ఫుల్ గా సాగుతున్న నేపథ్యంలో.. ప్రవాసీయులకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు.

అదే జరిగితే.. ఎన్నికలకు సంబంధించిన సరికొత్త కోణం తెర మీదకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. అధికారికంగా ఈ నిర్ణయం అమలు కావటానికి అవసరమైన న్యాయపరమైన అవరోధాల్ని అధిగమించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం పరిస్థితులు కాస్తంత సానుకూలంగా ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News