జోన్‌ పై ఆంధ్రోళ్ల గుండెలు ర‌గిలే మాట చెప్పారు

Update: 2018-03-14 04:58 GMT
ఏపీకి హ్యాండ్ ఇవ్వ‌టంలో మోడీ స‌ర్కారు ప‌రిపూర్ణం కావాల‌న్న‌ట్లుగా ఉంది. ఏపీకి చాలా చేశామ‌ని ఓప‌క్క ఏపీ బీజేపీ నేత‌లు ఎలాంటి మొహ‌మాటం ప‌డ‌కుండా అబ‌ద్ధాల మీద అబ‌ద్ధాలు చెప్పేస్తున్న వేళ‌.. వారికి తోడు పోయిన‌ట్లు మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది. విభ‌జ‌న గాయానికి ముందుగా హోదాను.. రైల్వేజోన్ ను ప్ర‌త్యేకంగా.. ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించ‌టం జ‌రిగింది.అయితే.. ఈ రెండు విష‌యాల్లోనూ మోడీ స‌ర్కారు మొద‌ట్నించి ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌లేదు.

ఏపీ అభివృద్ధికి కీల‌క‌మైన ఈ రెండు హామీల్ని నెర‌వేర్చ‌కుండా ఉండేందుకు ఉన్న మార్గాల్ని వెతుకుతున్న మోడీ స‌ర్కారు... ఇటీవ‌ల హోదాపై కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన సంగ‌తితెలిసిందే.

విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టంపై సానుభూతి ఉంద‌ని.. అలా అని సానుభూతితో నిధులు ఇవ్వ‌లేమ‌ని జైట్లీ చెప్పిన మాట ఆంధ్రోళ్ల‌కు ఎంత అవ‌మానంగా అనిపించాలో అంత అవ‌మానంగా అనిపించింది. ఆంధ్రోళ్లు ఏమీ అడుక్కుతినే వాళ్లు కాదు.. ప‌క్కోళ్ల నిధుల‌పై ఆశ లేద‌న్న మాట‌ను బ‌లంగా చెప్పాల‌నుకున్నా.. చెప్పేందుకు అనువైన వేదిక లేని దుస్థితి.

ఇదిలా ఉంటే.. ఆంధ్రోళ్ల భావోద్వేగాల‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌న్న‌ట్లుగా తాజాగా మ‌రో దారుణ ప్ర‌క‌ట‌న‌ను చేసింది మోడీ స‌ర్కారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ తో ఎలాంటి లాభం లేద‌ని తేల్చేసింది. కొత్త రైల్వేజోన్ తో ఎలాంటి లాభం ఉండ‌ద‌ని ఇప్ప‌టికే నివేదిక వ‌చ్చిన‌ట్లు కేంద్ర అధికారులు తాజాగా చెప్ప‌టం గ‌మ‌నార్హం.

విభ‌జ‌న చ‌ట్టంలోని 13వ షెడ్యూల్ లో ఉన్న సంస్థ‌ల ఏర్పాటుపై హోంశాఖ కార్య‌ద‌ర్శి రాజీవ్ గాబా.. అద‌న‌పు కార్య‌ద‌ర్శి టీఎస్ ఎన్వీ ప్ర‌సాద్‌.. వివిధ కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు.. ఏపీ.. తెలంగాణ అధికారుల‌తో క‌లిసి స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ రైల్వే జోన్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు.. కేంద్ర అధికారులు కాస్త గ‌ట్టిగా మాట్లాడారు. జోన్ వ‌ల్ల మీకేం లాభం ఉంటుంద‌ని ఏపీ అధికారుల్ని ప్ర‌శ్నించారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో విశాఖ‌కు రైల్వేజోన్ కు స‌మాధి కట్టేసిన‌ట్లే.
Tags:    

Similar News