అమ‌రావ‌తికి కేంద్రం ఇచ్చిందెంత‌?

Update: 2018-02-09 04:44 GMT
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత‌..  ఆర్థిక లోటుతో ఇబ్బందులు ప‌డుతున్న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్రం ఇప్ప‌టిదాకా చేసిందేమీ లేద‌న్న కోణంలో ఏపీ భ‌గ్గుమంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ - రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ... రెండు అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ మిత్ర‌ప‌క్షాలుగానే కొన‌సాగుతున్నా... ఏపీకి ఒరిగిందేమీ లేద‌న్న వాద‌న ఏపీ ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది. ఈ కార‌ణంగానే ఏపీకి కేంద్ర చేస్తున్న అన్యాయానికి నిర‌స‌న‌గా నిన్న జ‌రిగిన రాష్ట్ర బంద్‌కు ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగానే స‌హ‌క‌రించారు. ఎక్క‌డ కూడా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా బంద్ సాంతం ప్ర‌శాంతంగానే జ‌రిగింది. ప్ర‌జ‌ల స్వ‌చ్ఛంద స‌హ‌కారంతోనే ఈ త‌ర‌హా బంద్ జ‌రిగినట్లుగా చెప్పుకోవాలి. అయినా ఎప్ప‌టిక‌ప్పుడు ఇదుగో నిధులు... అదుగో హామీల అమ‌లు అంటూ నెట్టుకొచ్చేస్తున్న న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఇప్ప‌టిదాకా ఏపీకి న్యాయం చేసిన పాపానే పోలేదు. విభ‌జ‌న చ‌ట్టంలో చాలా హామీలు ఉన్నా.. వాటిలో కేంద్రం నెర‌వేర్చింది చాలా త‌క్కువేన‌ని చెప్పాలి. అయినా రాజధాని కూడా లేకుండా క‌ట్టుబ‌ట్ట‌ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేసిన చందంగా ఏపీ ఏర్ప‌డితే... ఆ రాష్ట్రానికి మిగ‌తా రాష్ట్రాల‌కు మ‌ల్లే సాయం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది క‌దా. కేంద్ర‌మే పెద్ద‌న్న త‌ర‌హాలో ఈ సాయం చేయాల్సి ఉంది.

మ‌రి ఆ దిశ‌గా బీజేపీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోందా? అంటే... లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఈ విష‌యాన్ని కాస్తంత ప‌క్క‌న‌పెడితే.. ఇప్ప‌టికే ఏపీకి చాలా చేశామ‌ని - ఇంకా చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయ‌ని చెబుతున్న కేంద్ర ప్ర‌భుత్వం... ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీకి ఇదిచ్చాం... అది ఇచ్చాం అంటూ కాలం వెళ్ల‌దీస్తున్న మాట మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. అయితే కేంద్ర చెబుతున్న‌ట్లుగా రాష్ట్రానికి నిధులేమీ రాలేద‌న్న‌ది ఇక్క‌డి అధికార పార్టీ టీడీపీ మాటగా వినిపిస్తున్న సంగ‌తీ తెలిసిందే. అటు కేంద్రం పార్ల‌మెంటు సాక్షిగానే... ఇప్ప‌టిదాకా ఏపీకి ఈ మేర నిధులిచ్చామంటూ గొప్ప‌లు చెప్పుకుంటోంది. అదే స‌మ‌యంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందింతేనంటూ టీడీపీ స‌ర్కారు కూడా ఏపీ అసెంబ్లీ సాక్షిగా త‌న వాద‌న‌ను వినిపించిన సంగ‌తీ తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో చ‌ట్ట‌స‌భగా ఉన్న పార్ల‌మెంటులో గానీ, రాష్ట్ర స్థాయిలో చ‌ట్ట‌స‌భ‌గా ఉన్న అసెంబ్లీలో గానీ... అధికారంలో ఉన్న పార్టీల‌తో పాటు విప‌క్షాలు కూడా అబద్ధాలు చెప్ప‌డానికి వీల్లేదు. మ‌రి కేంద్రం చెబుతున్న మాట‌కు - రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌కు ఎందుకు పొంత‌న కుద‌ర‌డం లేద‌న్న‌దే ఇప్పుడు అతి పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 ఈ విష‌యానికి సంబంధించిన గంద‌ర‌గోళం ఏ స్థాయిలో ఉంద‌న్న విష‌యం... రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల విష‌యాన్ని ప‌రిశీలిస్తేనే అర్థ‌మైపోతుంది. కొత్త‌గా క‌ట్టుకోవాల్సిన రాజ‌ధానిలో అసెంబ్లీ - హైకోర్టు - స‌చివాల‌యం - రాజ్ భ‌వ‌న్ త‌దిత‌రాల‌ను కేంద్ర‌మే త‌న సొంత నిధుల‌తో నిర్మించి రాష్ట్రానికి స‌హ‌క‌రించాల్సి ఉంది. ఈ విష‌యంలో కేంద్రం కూడా మాట త‌ప్ప‌డానికి వీల్లేదు. మ‌రి ఇప్ప‌టిదాకా న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులెంత? అంటే... కేంద్రం ఒక మాట చెబుతుంటే... రాష్ట్రం ఇంకో మాట చెబుతోంది. అమ‌రావ‌తి నిర్మాణానికి గాను ఇప్ప‌టిదాకా రూ.2,500 కోట్ల మేర నిధుల‌ను విడుద‌ల చేశామ‌ని కేంద్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ నిధులను ఎలా వాడార‌న్న విష‌యాన్ని చెబుతూ యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇస్తే... మిగిలిన నిధులు కూడా ఇస్తామ‌ని చెబుతోంది. అంత‌టితో ఆగ‌ని కేంద్రం... ఇచ్చిన నిధుల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు లెక్క‌లు చెప్ప‌డం లేద‌ని - అందుకే రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి మ‌లి విడ‌త నిధుల‌ను ఇవ్వ‌డం లేద‌ని కూడా కేంద్రం వాదిస్తోంది.

అయితే ఇదే విష‌యంపై ప‌లుమార్లు ప్ర‌క‌ట‌న‌లు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం..   రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసింది రూ.1,500 కోట్లేన‌ని చెబుతోంది. రూ.11,000 కోట్ల మేర నిధులు ఇవ్వాల్సి ఉన్న చోట కేవ‌లం 1,500 కోట్లు మాత్ర‌మే ఇచ్చి యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు అడిగితే ఎలాగంటూ కూడా చంద్ర‌బాబు స‌ర్కారు త‌న వాద‌న‌ను కూడా బ‌లంగానే వినిపిస్తోంది. అంతేకాకుండా నిన్న రాష్ట్ర బంద్ సంద‌ర్భంగా స‌చివాల‌యం సాక్షిగానే మీడియా ముందుకు వ‌చ్చిన మంత్రి నారాయ‌ణ... ఈ రూ.1,500 కోట్ల నిధుల‌కు కూడా తాము ఎప్పుడో యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు కేంద్రానికి అంద‌జేశామ‌ని చెప్పుకొచ్చారు. ఈ మేర నిధుల‌కే కేంద్రం - రాష్ట్రం మ‌ధ్య‌న పొంత‌న కుద‌ర‌క‌పోతే.. ఇక ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిని ఎలా నిర్మిస్తార‌న్న కొత్త ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. మొత్తంగా ఈ విష‌యంపై రెండు మాట‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో... ఏ మాట సరైన‌దో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త అటు న‌రేంద్ర మోదీ స‌ర్కారుతో పాటు ఇటు చంద్ర‌బాబు స‌ర్కారుపైనా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ దిశ‌గా క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News