రాష్ట్రాల‌కు విద్యుత్ అప్పుగా ఇవ్వ‌టానికి మోడీ స‌ర్కార్ నో!

Update: 2019-07-03 07:07 GMT
రాష్ట్రం.. కేంద్రం.. అన్ని వ్య‌వ‌స్థ‌లో భాగ‌మే. పాల‌నా సౌల‌భ్యం కోస‌మే త‌ప్పించి.. ఈ రెండు ప‌ని చేసేది ప్ర‌జ‌ల కోస‌మే. కాకుంటే.. కేంద్రం త‌న పెద్ద‌న్న త‌ర‌హాను అప్పుడ‌ప్పుడు ప్ర‌ద‌ర్శిస్తూ రాష్ట్రాల‌కు చుక్క‌లు చూపిస్తుంటుంది. అలా అని.. రాష్ట్రాలు బాధ్య‌త‌గా ఉంటాయా? అంటే అది లేద‌నే చెప్పాలి. త‌ర‌చూ త‌మ తీరుతో కేంద్రానికి చుక్క‌లు చూపించే ఉదంతాలు కూడా లేక‌పోలేదు. ఇదంతా ఎందుకంటే.. కొన్ని రాష్ట్రాల తీరుతో కేంద్రం ఒక క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇక‌పై అప్పు కింద‌ క‌రెంటు ఇచ్చేందుకు కేంద్రం నో చెప్పేసింది.

రాష్ట్రాలు తమ‌కు అవ‌స‌ర‌మైన క‌రెంటును ముందుస్తుగా డ‌బ్బులిచ్చి కొనుగోలు చేసుకోవాల్సిందే త‌ప్పించి అప్పుగా ఇవ్వ‌టానికి స‌సేమిరా అంటోంది. దీనికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల్ని కూడా సిద్ధం చేసింది. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి మొన్న‌టి వ‌ర‌కూ రాష్ట్రాలు త‌మ‌కు అవ‌స‌ర‌మైన క‌రెంటును కేంద్రం నుంచి అడిగి తీసుకునేది. త‌ర్వాత వాటి చెల్లింపులు చెల్లించేవి. మ‌నం ఎలా అయితే క‌రెంటు వాడుకొని నెల త‌ర్వాత బిల్లు క‌డ‌తామో అదే తీరులో.

అయితే..కొన్ని రాష్ట్రాలు క‌రెంటును కేంద్రం నుంచి తీసుకోవ‌ట‌మేకానీ చెల్లింపుల విష‌యంలో చుక్క‌లు చూపిస్తున్నాయ‌ట‌. దీంతో.. పీక‌ల్లోతు అప్పుల్లో కేంద్ర ఇంధ‌న శాఖ కూరుకుపోతోంది.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త నిర్ణ‌యాన్ని తీసుకుంది. దీని ప్ర‌కారం విద్యుత్ అవ‌స‌ర‌మైన రాష్ట్రాలు ముందుగా త‌మ‌కు అవ‌స‌ర‌మైన విద్యుత్ కు సంబంధించిన లెట‌ర్ ఆఫ్ క్రెడిట్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదో ర‌కంగా చెప్పాలంటే మ‌నం మొబైల్ ను రీఛార్జ్ చేసుకొని వాడుకోవ‌టం త‌ర‌హాకు చెందిందిగా చెప్పాలి. రాష్ట్రాలు త‌మ‌కు అవ‌స‌ర‌మైన విద్యుత్ ను ముందుగా చెల్లించి ఆ త‌ర్వాతే వాడుకోవాల్సి ఉంటుంది.

కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణ‌యం రాష్ట్రాల మీద పిడుగు మాదిరి మారింద‌ని చెబుతున్నారు. విద్యుత్ వాడుకున్న త‌ర్వాత కూడా డ‌బ్బులు చెల్లించ‌ని రాష్ట్రాలు.. ఇప్పుడు ఏకంగా విద్యుత్ వాడుకోవ‌టానికి ముందే  డ‌బ్బులు చెల్లించే తీరుతో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని కూడా త‌ప్పు ప‌ట్ట‌టానికి వీల్లేదు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర విద్యుత్ సంస్థ ఎన్టీపీసీకి రావాల్సిన రుణాలు ఏకంగా రూ.45వేల కోట్లుగా చెబుతున్నారు. మ‌రీ కొత్త విధానంతో రాష్ట్రాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News