ఆంధ్రోళ్ల హ‌క్కును అడుక్కునేలా చేశావే మోడీ!

Update: 2017-09-27 03:43 GMT
గొప్ప‌గా మాట్లాడే వారంతా గొప్ప‌గా ప‌ని చేస్తార‌న్న రూల్ ఉండ‌దు. నిత్యం స్ఫూర్తివంత‌మైన మాట‌ల్ని చెప్పే ప్ర‌ధాని మోడీ మాట‌ల‌కు చేత‌ల‌కు ఏ మాత్రం పొంత‌న ఉండ‌ద‌న్న విష‌యం తెలిసిందే. ఆంధ్రోళ్ల విష‌యంలో ఆయ‌న ఎగ్గొట్టిన మొత్తం లెక్క చూస్తే క‌డుపు ర‌గిలిపోవాల్సిందే. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ లోటును భ‌ర్తీ చేస్తామ‌న్న హామీకి భిన్నంగా మోడీ బ్యాచ్ ఎగ్గొట్టిన మొత్తం వేల కోట్ల రూపాయిలు ఉండ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు హ‌క్కుగా త‌మ‌కు రావాల్సిన నిధుల్ని అడుక్కునేలా చేసిన ఘ‌న‌త మోడీదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అదెలానంటే..

ఏపీ రెవెన్యూ లోటుపై స‌ర్కారు త‌యారు చేసిన లెక్క‌ల‌తో స‌సేమిరా అంటోంది మోడీ స‌ర్కారు.  ఏపీ ప్ర‌భుత్వ లెక్క‌లు మాత్ర‌మే కాదు.. చివ‌ర‌కు కాగ్ త‌యారు చేసిన నివేదిక‌నూ లైట్ తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. లెక్క‌ల ప్ర‌కారం రావాల్సిన మొత్తాన్ని ప‌క్క‌న పెట్టేసి.. తాను త‌యారు చేసిన లెక్క‌ల్లో ఏపీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని కుదించిన మోడీ స‌ర్కారు చివ‌ర‌కు త‌న మాయ లెక్క‌ల‌తో ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం కేవ‌లం రూ.138.39 కోట్లుగా తేల్చింది.

బాబు లెక్క‌ల్ని ప‌క్క‌న పెడితే.. కాగ్ వేసిన లెక్క ప్ర‌కారం.. విభ‌జ‌న నేప‌థ్యంలో  ఏపీ రాష్ట్ర లోటు రూ.16వేల కోట్లుగా తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదిక‌ను కేంద్రానికి పంపింది.  ఇందుకు మోడీ స‌ర్కారు నో చెప్పేసింది. ఎందుక‌లా అంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌కు చేసిన ఖ‌ర్చును రెవెన్యూ లోటులోకి చేర్చార‌న్న‌ది మోడీ స‌ర్కారు మాట‌. విభ‌జ‌న జ‌రిగిన ఏడాది ఏపీ నిక‌ర రెవెన్యూ లోటు రూ.4117.89 కోట్లు మాత్ర‌మేన‌ని తేల్చింది.

దీంతో.. మోడీ స‌ర్కారు లెక్క ప్ర‌కారం ఏపీ లోటు రూ.4117.89 కోట్లుగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ లోటు ఖాతా కింద‌కు  రూ.3979.50 కోట్లు విడుద‌ల చేసింది. ఈ లెక్క ప్ర‌కారం ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన మొత్తం రూ.138.39కోట్లు మాత్ర‌మేన‌ని తేల్చింది.

ఈ లెక్క‌ల్ని వినే ఏ ఆంధ్రోడి క‌డుపు అయినా ర‌గిలిపోవ‌టం ఖాయం. ఆదుకుంటాన‌ని.. అండ‌గా ఉంటాన‌ని చెప్పి.. చివ‌ర‌కు భారీగా హ్యాండ్ ఇచ్చిన వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. పైకి మిత్రుడిగా క‌నిపించే మోడీ ఇంత‌గా హ్యాండ్ ఇవ్వ‌టం చూస్తే నిధుల విడుద‌ల విష‌యంలో ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారో అర్థ‌మ‌వుతుంది. అంతేనా.. మొద‌టి సంవ‌త్స‌రం లోటును మూడున్న‌రేళ్లు గ‌డిచినా విడుద‌ల చేయ‌క‌పోవ‌టంలో అర్థం ఏమిటి? ఆర్థికంగా బ‌ల‌హీనంగా ఉన్న రాష్ట్రానికి ఇవ్వాల్సిన మొత్తాన్నిఏళ్ల‌కు ఏళ్లు పెండింగ్‌ లో ఉంచితే ఆ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌. హ‌క్కుగా ఆంధ్రోళ్ల‌కు రావాల్సిన లోటు మొత్తాన్ని అడుక్కునేలా చేసిన మోడీ స‌ర్కారును గ్రేట్ అనాల్సిందే. ఏపీ స‌ర్కారు ఎంత బ‌తిమిలాడినా లైట్ తీసుకుంటున్న మోడీ అండ్ కో తీరు ఆంధ్రోళ్ల ప్ర‌యోజ‌నాల్ని భారీగా గండి కొట్టింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News