టూర్ల విషయంలోనూ గవర్నర్లకు ఆంక్షలు?

Update: 2015-04-13 04:27 GMT
రాజ్యాంగ పదవులకు సంబంధించి అత్యంత కీలకమైన పదవుల్లో గవర్నర్‌ పదవి ఒకటి. పేరుకు రబ్బర్‌స్టాంప్‌ అని చెప్పినప్పటికీ..చట్టం గురించి బాగా అవగాహన ఉన్న వారు గవర్నర్‌ స్థానంలో ఉన్నా.. లిటిగెంట్‌ పెట్టే నేతలు గవర్నర్‌ కుర్చీలో కూర్చున్నప్పుడు.. గవర్నర్‌ పోస్ట్‌ ఎంత కీలకమైనదన్న విషయం అర్థమవుతుంది.

ప్రయాణం సాఫీగా సాగుతున్నప్పుడు గవర్నర్‌ పాత్ర నామమాత్రంగా ఉంటుంది కానీ.. కాస్తంత లెక్క తప్పినప్పుడు మాత్రం గవర్నర్‌ ఎంత శక్తివంతమైన వ్యక్తో ఇట్టే అర్థమవుతుంది.

పాలనలో మార్పులు తెచ్చేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కారు చాలానే మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకొంటోంది. తాజాగా గవర్నర్‌లను సైతం ఆంక్షల చట్రంలోకి తీసుకొచ్చింది. గవర్నర్‌ హోదాలో ఉండి.. దాన్నో విలాసవంతమైన పదవిగా భావించి ఖజానా మీద విపరీతంగా భారం మోపే వారికి చెక్‌ చెబుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

గవర్నర్లు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల్లో కాకుండా బయట ప్రాంతాల్లో ఎక్కువగా గడుపుతున్నారన్న విమర్శలకు తెర దించేలా తాజా నిర్ణయం ఉండటం గమనార్హం. ఏడాదిలో 292 రోజులు గవర్నర్లు తాము పని చేస్తున్న రాష్ట్రాల్లోనే ఉండాలని ఈ కొత్త నిబంధనల్లో కీలకమైనది.

గవర్నర్లు తాము పని చేస్తున్న రాష్ట్రం వదిలి బయటకు వెళ్లాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ స్థాయికి వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్లాలంటే పర్మిషన్లు తీసుకోవటం లాంటివి అంత బాగోదేమో. నిబంధనల చట్రంలోకి తీసుకురావటం బాగానే ఉన్నా.. ఇలాంటివి గౌరవనీయ స్థానాలకు అపాదించటం ద్వారా.. వారు స్వతంత్రులు అన్న భ్రమగా మారుతుంది.

నిజానికి ఆంక్షలతో గవర్నర్లకు ముకుతాడు వేయాలని భావించేకన్నా.. అసలు అలాంటి వైఖరి ఉన్న వారిని మార్చేస్తే.. మిగిలిన వారికి ఒక పాఠంగా మారుతుంది కదా. స్కూల్లో పిల్లలకు క్లాస్‌రూంలో ఎలా ఉండాలో చెప్పే రీతిలో.. గవర్నర్ల విషయంలోనూ అనుసరించటం అంత సబబుగా ఉండదేమోనన్న భావన వ్యక్తమవుతోంది. మరి.. కొత్త నిబంధనల పట్ల గవర్నర్లు ఎలా రియాక్ట్‌ అవుతారో..?

Tags:    

Similar News