కేంద్రం మాట‌..రామ‌సేతుకు న‌ష్టం జ‌ర‌గ‌నివ్వం

Update: 2018-03-17 04:32 GMT
సుదీర్ఘకాలంగా వార్త‌ల్లో నిలుస్తున్న సేతు స‌ముద్రం విష‌యంలో కేంద్రం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసింది. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పురాతన రామసేతు కట్టడానికి ఎలాంటి ప్రమాదంగానీ, నష్టంగానీ జరుగనివ్వమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మక సేతుసముద్రం షిప్ చానల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందని, అయితే ఈ నిర్మాణం వల్ల రామసేతు కట్టడానికి ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని, రామసేతు కట్టడానికి హాని జరుగకుండా చర్యలు చేపడుతామని, అవసరమైతే ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేయడానికీ సిద్ధమేనని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

షిప్ చానల్ ప్రాజెక్టు వల్ల రామసేతుకు ప్రమాదం పొంచి ఉన్నదని, దీనిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజాన్ని విచారించిన ధర్మాసనం కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర నౌకాయాన శాఖ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వాదనలు వినిపిస్తూ షిప్ చానల్ ప్రాజెక్టు ప్రభావం రామసేతుపై పడనివ్వమని, ఎలాంటి నష్టం జరుగనివ్వమని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
Tags:    

Similar News