సాయం చేయమంటే సలహాలు ఇస్తున్న కేంద్రం

Update: 2016-01-11 06:45 GMT
ఏపీ ఆర్థిక స్థితిగతులపై కేంద్రం అసంతృప్తిగా ఉందట.. అనవసర ఆర్భాటాల కోసం అప్పులు చేసి మరీ నిధులు ఖర్చు చేస్తున్నారంటూ... ఖర్చులు తగ్గించుకోవాలని  ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సూచనలు చేసిందని సమాచారం. అయితే.. కేంద్రాన్ని నిధులు అడిగిన ప్రతిసారీ ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఇలా దుబారా ముద్ర వేస్తోంది. నిధులు ఇవ్వకుండా తప్పించుకునేందుకే ఈ వ్యూహం అనుసరిస్తున్నారని రాష్ట్ర అధికారులు అంటున్నారు.
    
విభజన తరువాత ఆర్థిక ఆసరా లేని ఏపీకి అప్పులు తప్పడం లేదు.  పాలన అవసరాలు, సంక్షేమ పథకాలతో పాటు తక్షణ అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చులు తప్పడం లేదు. అయితే... ఆదాయం ఆ స్థాయిలో లేకపోవడంతో రాష్ట్రం అప్పులకు వెళ్తోంది. ఇప్పటికే రూ.11050 కోట్ల వరకు మార్కెట్‌ బారోయింగ్స్ కు వెళ్లిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.2 వేల కోట్లకు దరఖాస్తు చేసుకుది. ఈ నిధులు బుధవారానికి రాష్ట్ర ఖజానాకు చేరు కోనున్నాయి. దీంతో ఈ ఏడాది మార్కెట్‌ రుణాలే రూ.13 వేల కోట్లు దాటిపోతాయి. ఆర్థిక సంవత్సరం చివరి 80 రోజుల్లోనూ కేవలం రూ.3500 కోట్ల వరకే రుణాలకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొంత అదనంగా రుణం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానికి కేంద్రం సానుకూలంగా స్పందించలేదు సరికదా... ఖర్చులు తగ్గించుకోవాలంటూ సాకులు చెబుతోంది.    

వాస్తవానికి ఏపీలో కొన్ని అనుత్పాదక  ఖర్చులు ఎక్కువయ్యాయి. కొత్త రాజ ధాని, ఉమ్మడి రాజధాని మధ్య రాకపోకలకు, విజయవాడలో వివిధ కార్యాలయాల మరమ్మతులకు - ప్రారంభోత్సవాలు - శంకుస్థాపనలకు నిధులు ఖర్చవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో ఇలాంటి అనుత్పాదక వ్యయం తప్పదు. కేంద్రానికి ఈ విషయం తెలియదా... లేదంటే తమను నిధులు అడగాలంటే భయపడేలా చేయడానికి రాష్ట్రంపై ఇలా పదేపదే దుబారా ముద్ర వేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News