విడాకులు తీసుకున్న మరుక్షణమే ఆ హక్కు రద్దు ... కేంద్రం క్లారిటీ !

Update: 2021-04-10 06:30 GMT
పెళ్లి , విడాకులు అనేవి ఈ సమాజంలో సహజమే అయినప్పటికీ , పెళ్లి .. విడాకులతో ఎన్నో బంధాలు , హక్కులు ముడిబడి ఉన్నాయి. పెళ్లి తర్వాత వచ్చే బంధాలు చాలానే ఉంటాయి. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత వదులుకోవాల్సిన హక్కులు కూడా ఉంటాయి. దీనిపై తాజాగా కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. భారతీయ పౌరులను పెళ్లి చేసుకున్న విదేశీయులు ఎవ్వరైనా విడాకులు తీసుకుంటే , ఆ తర్వాత వారికి ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) హక్కు ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న మరుక్షణమే ఆ హోదా రద్దవుతుందని వెల్లడించింది. ఈ విషయం భారతీయ చట్టంలో స్పష్టంగా ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది.

వివరాల్లోకి వెళ్తే ... భారతీయ పౌరుడిని పెళ్లాడిన ఒక బెల్జియం మహిళ కొంతకాలం క్రితం భర్త నుంచి విడాకులకి అప్లై చేసి చట్టం ప్రకారం తీసుకుంది. ఈ కారణంగా  ఓసీఐ కార్డును తిరిగి ఇచ్చేయాలని బెల్జియంలోని భారత రాయబార కార్యాలయం ఆమెను కోరింది.  దీనికి ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సవాలు చేస్తూ బెల్జియం మహిళ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే విచారణకు వచ్చిన ఈ  కేసులో కోర్టు ప్రశ్నించగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరాలు తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. భారత పౌరసత్వ చట్టం – సెక్షన్‌ 7డి (ఎఫ్) ప్రకారం, భారత పౌరులను వివాహమాడిన విదేశీయులు, విడాకుల తర్వాత ఓసీఐ హోదాను కోల్పోతారు. లేదా అర్హతలేని విదేశీయుల ఓసీఐ కార్డు రిజిస్ట్రేషన్ రద్దవుతుందని తేలింది.

భారత పౌరుడిని పెళ్లి చేసుకున్నందున బెల్జియంలోని భారత రాయబార కార్యాలయం ఆ మహిళకు 2006 అగస్టు 21న పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ కార్డు (పీఐఓ)ను జారీ చేసింది. అనంతరం 2011 అక్టోబరులో ఆ మహిళ అతని నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకుంది. విడాకుల తర్వత ఆమెకు జారీ చేసిన పీఐఓ కార్డు రద్దు కావాల్సి ఉన్నప్పటికీ..ఆ సమయంలో అది రద్దు కాలేదు. అయితే, 2017లో ఆమెకు అనుకోకుండా ఓసీఐ కార్డు జారీ అయినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటికీ ఆమెకు జారీ చేసిన ఓసీఐ కార్డు రద్దు కాలేదనీ, దాన్ని తిరిగి అప్పజెప్పాలని లేదంటే చట్ట ప్రకారం కార్డు రద్దు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Tags:    

Similar News