కరోనాను తరమాలంటే ఏసీ టెంపరేచర్ ఇంతే ఉండాలట

Update: 2020-04-26 02:30 GMT
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు మిగతా దేశాలతో పాటు భారత్ లాక్ డౌన్ విధించింది. మండు వేసవిలో విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాలేక....అటు ఇళ్లలో వేడికి ఎక్కువ సేపు ఉండలేక ఇబ్బందిపడుతున్నారు. అయితే, ఏసీలు, కూలర్లు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినా...వాటి వల్ల కూడా కరోనా సోకే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ చైనాలోని ఓ రెస్టారెంట్ లోని ఏసీ ద్వారా కరోనా సోకినట్లు తేలింది. దీంతో, చాలామంది ఏసీలు, కూలర్లు వేయాలంటే భయపడుతున్నారు. ఫ్యాన్లు కొంతవరకు ఉపశమనమిచ్చినా....ఏసీ, కూలర్లు అంత చల్లదనం ఇవ్వకపోవడంతో ఫ్యాన్లతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వాడకంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. తేమ వాతావరణంలో ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ కు దగ్గరగా సెట్ చేయాలని, పొడి వాతావరణంలో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా చూసుకోవాలని కేంద్రం సూచించింది.

సంబంధిత తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలని సూచించింది. ఏసీలు ఆన్ లో ఉన్నప్పుడు రూమ్ కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచడం ద్వారా గాలి శుభ్రపడుతుందని తెలిపింది. కిచెన్, టాయిలెట్లలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ లో ఉంచడం ద్వారా దుమ్ము, ధూళితో కూడిన గాలిని నిరోధించవచ్చని తెలిపింది.గాలిని బయటి నుంచి స్వీకరించేలా కూలర్లను సెట్ చేసుకోవాలని, ఎవాపరేటివ్ కూలర్లలో నీటి ట్యాంకులను శుభ్రపరచాలని సూచించింది. ఒకసారి వాడిన నీటిని తొలగించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, కిటికీలు తెరిచే ఉంచాలని సూచించింది. పోర్టబుల్ ఎవాపరేటివ్ కూలర్లు బయటి నుంచి గాలిని స్వీకరించలేవు కనుక వాటి వాడకం తాత్కాలికంగా నిలిపివేయడం ఉత్తమమని చెప్పింది. ఫ్యాన్లు తిరిగే సమయంలో గది కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలని, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆన్ లో ఉంటే మరీ మంచిదని తెలిపింది.


మరోవైపు, మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే...విమాన ప్రయాణికులను ఏ విధంగా అనుమతించాలన్న విషయంపై విమానయాన సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. ప్రయాణికులతో పాటు, విమాన సిబ్బంది తప్పకుండా మాస్కులు వాడాల్సిందేనని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. విమానంలో అందించే భోజనాన్ని రద్దు చేస్తున్నామని, కేవలం నీళ్లు మాత్రమే అందించనున్నామని తెలిపారు. పరిమిత సంఖ్యలో మాత్రమే లావెటరీలను అనుమతిస్తామని చెప్పింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరని, థర్మల్‌ స్క్రీనింగ్ తర్వాతే టర్మినల్‌కు వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపింది. ప్రయాణికులు ఫిజికల్ డిస్టన్స్ పాటించడం, వారిని విడతల వారిగా విభజించి మెడికల్‌ టెస్టులు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటామని వివరించింది. ఈ అంశాలపై కేంద్ర విమానయాన శాఖకు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే, కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేతపై ప్రకటన చేసిన తర్వాతే ఈ రకంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News