కేవీపీ అరెస్టుకు కేంద్రం అడ్డు పడుతుందా?

Update: 2015-09-05 07:15 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు ఇప్పుడు ముదిరి పాకాన పడుతున్నాయి. రాజకీయ నేపథ్యానికి, వ్యక్తిగత వైషమ్యాలు కూడా తోడైతే.. ఎలాంటి మలుపులు తీసుకుంటాయో తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా పేరున్న కేవీపీ రామచంద్రరావును అరెస్టు చేసే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ సృష్టిస్తుందా? లేదా? అనే మీమాంస రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మాత్రం.. సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం ద్వారా ఆయనను జైలుకు పంపగలం అని ఉత్సాహపడుతోంది. కానీ అది అంత సులువుగా సాధ్యం కాకపోవచ్చునని.. స్వయంగా కేంద్రప్రభుత్వమే ఇలాంటి చర్య తీసుకోవడానికి అడ్డు పడవచ్చునని న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.

కేవలం రెండే పదాలు.. ఇప్పుడు కేవీపీ మెడకు చుట్టుకుంటున్నాయి. ఏపీ అసెంబ్లీ లాంజ్‌లో గతంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫోటో ఏర్పాటుచేశారు. దానిని తెలుగుదేశం సర్కారు వచ్చిన ఏడాది తర్వాత.. ఇటీవల తొలగింపజేసింది. తమ నేత ఫోటో తీసేయడంపై సహజంగానే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆందోళన చేసింది. కాంగ్రెస్‌ పెద్దగా ఈ విషయం పట్టించుకోకపోయినా.. వైఎస్‌కు సన్నిహితుడు గనుక.. కేవీపీ రామచంద్రరావు మాత్రం.. సీరియస్‌గా తీసుకున్నారు. ఫోటోను తొలగించడం చాలా అన్యాయం అని, దానిని వెంటనే తిరిగి యథాస్థానంలో ఉంచాలని కోరుతూ ఆయన స్పీకరు కోడెల శివప్రసాద రావుకు ఒక లేఖ రాశారు. వైకాపా ఆందోళనలు, కేవీపీ లేఖ వేటినీ స్పీకరు ఖాతరు చేయలేదు. అయితే లేఖలో కేవీపీ ప్రయోగించిన రెండు పదాలు ఇప్పుడు ఆయనను తప్పు చేసిన వ్యక్తిగా నిలబెడుతున్నాయి.

వైఎస్‌ ఫోటో తొలగించడం తగదు అని రాసిన లేఖలో ఆయన ... 'ఈ చర్య చాలా అనాగరికం, అక్రమం' అంటూ పేర్కొన్నారు. స్పీకరు కోడెల ఆ పదాల్ని గట్టిగా పట్టుకున్నారు. ఈ పదాలు.. గౌరవనీయమైన శాసనసభ సభాపతి స్థానాన్ని, శాసనసభను కించపరిచేలా ఉన్నాయంటూ సభలో ప్రకటించారు. మరురోజు తెదేపా సభ్యులు కేవీపీ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకూడా ఇచ్చారు. ప్రస్తుతం అది ఎథిక్స్‌ కమిటీ వద్ద ఉంది.

అయితే ఎథిక్స్‌ కమిటీ సిఫారసు చేసినా సరే..కేవీపీ మీద చర్య తీసుకోవడం అనేది సులువు కాదని నిపుణులు చెబుతున్నారు. కోడెల చర్య తీసుకోదలచుకున్నా సరే.. ముందుగా రాజ్యసభ ఛైర్మన్‌ అనుమతిని కోరాల్సి ఉంటుంది. అటునుంచి అంత సులువుగా అనుమతి రాకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు. కేంద్రంనుంచి అనుమతి లేకుండా.. కేవీపీని శాసనసభ ఎదుటకు పిలిపించి విచారించడం కుదరని పని అని పలువురు పేర్కొంటున్నారు. ఈ వివాదం మరింత ముదరకుండా ఉండడానికి గాను, అసలు కేవీపీపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం అడ్డుపడవచ్చునని, ఆయన విచారణకు అనుమతివ్వకుండా.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించవచ్చునని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News