కేంద్రమంత్రి చెప్పినా జరగని పని..ఆ ఎంపీ లాబీయింగ్ సాధించింది!

Update: 2019-09-05 01:30 GMT
వాళ్లు కేంద్రంలో కేబినెట్ ర్యాంకులో ఉన్న ఒక మంత్రికి బాగా  కావాల్సిన వాళ్లు. మోడీ కేబినెట్ లో అత్యంత కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి చుట్టాలు! విదేశానికి వెళ్లి వస్తూ వస్తూ అక్కడ నుంచి ఎలక్ట్రిక్  గూడ్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. అది నిబంధనలకు విరుద్ధం. అయితే మరీ తీవ్రమైన తప్పిదం  అయితే  కాదు.

కానీ విమానాశ్రయంలో కస్టమ్స్  అధికారులు వారిని ఆపారు. నిబంధలను వారికి వివరించడంతో పాటు విచారణకు అంటూ వారిని ఆపారు. అయితే కేంద్రమంత్రితో బంధుత్వం ఉన్న వారు నిబంధనలను అతిక్రమించిన సమయంలో ఊరికే ఉండరు కదా. వెంటనే కేంద్రమంత్రితో లైన్ కలిపించారు. తమను వదిలేయాల్సిందిగా ఆ మంత్రి చేత చెప్పించారు.

సదరు మంత్రి కూడా తన వంతుగా అధికారులకు చెప్పారు. తమ వాళ్లే వదిలేయమని సూచించారు. అయినా కూడా అధికారులకు మాత్రం వదలడానికి మనసు రాలేదు. నిబంధనలను అమలు చేయాలనే తాపత్రయంతో వారిని అక్కడే ఆపారు.

అయితే సదరు వ్యక్తులకు కేంద్రమంత్రితోనే కాదు.. ఒక బీజేపీ ఎంపీతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయట. ఆయన ఇటీవలే బీజేపీలోకి చేరిన తెలుగు వ్యక్తి. లాబీయింగ్ కు పెట్టింది పేరు. ఆయన ఆ అధికారులకు డైరెక్టుగా ఫోన్ చేయలేదట. ఎవరి చేత చెప్పిస్తే ఆ అధికారులు వదిలేస్తారో సదరు వ్యక్తులకు ఫోన్ కలిపాడట ఆ ఎంపీ. దీంతో సదరు  వ్యక్తులకు విమానాశ్రయంలో గ్రీన్ సిగ్నల్ లభించడమే కాదు.. రెడ్ కార్పేట్ ట్రీట్ మెంట్ దక్కిందట!

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఆదేశాలు ఇవ్వగల స్థాయిలో ఉన్న కేంద్రమంత్రికి మించిన స్థాయిలో ఆ ఎంపీకి లాబీయింగ్ పవర్ ఉండటం. తన లాబీయింగ్ శక్తితో అతడు కేంద్రమంత్రితో కూడా సాధ్యం కాదనిపించిన పనిని ఇట్టే చేసి చూపించాడట. ఇలాంటి లాబీయిస్టుగానే ఆయన రాజకీయాల్లో మనుగడ సాధిస్తూ ఉన్నట్టుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు
Tags:    

Similar News