ఏమాత్రం త‌గ్గ‌ని నితిన్.. మ‌రోసారి హాట్ కామెంట్స్!

Update: 2022-08-28 07:19 GMT
నితిన్ గ‌డ్క‌రీ.. మ‌హారాష్ట్ర‌లోని విద‌ర్బ ప్రాంతంలో బీజేపీలో కీల‌క నాయ‌కుడు. అందులోనూ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఆర్ఎస్‌) కేంద్ర కార్యాల‌యం ఉన్న నాగ్‌పూర్‌కు చెందిన నేత‌. ఆర్ఎస్ఎస్‌తో అనుబంధ‌మూ ఎక్కువే. అన్ని పార్టీల నేత‌ల‌తోనూ ఆయ‌నకు స‌త్సంబంధాలు ఉన్నాయి. ప్ర‌ధాని ప‌ద‌వికి మొద‌ట్లో న‌రేంద్ర మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న నితిన్ గ‌డ్క‌రీ పేరు గ‌ట్టిగానే వినిపించింది.

అయితే ప్ర‌స్తుతం కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గ‌డ్క‌రీని అనూహ్యంగా కొద్దిరోజుల క్రితం బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. బీజేపీలో అత్యున్న‌త నిర్ణ‌యాలు తీసుకునేది.. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు అనే విష‌యం తెలిసిందే. అలాంటిది బీజేపీలో మోడీ, అమిత్ షా త‌ర్వాత మూడో స్థానంలో ఉన్న‌ నితిన్ గ‌డ్క‌రీని బీజేపీ పార్ల‌మెంటరీ బోర్డు నుంచి తొల‌గించడం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా నితిన్ గ‌డ్క‌రీకి ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ‌తారనే పేరుంది. ముక్కుసూటిగా, దాప‌రికం లేకుండా మాట్లాడ‌తార‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో త‌న‌ను బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి తొల‌గించిన ద‌గ్గర నుంచి ఆయ‌న హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న వార్త‌ల్లో వ్య‌క్తిగా మారారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే ప్రస్తుతమున్న సమస్య అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

అయినా ఆగ‌ని నితిన్ గ‌డ్క‌రీ.. బీజేపీ అధికారంలోకి రావ‌డానికి అద్వానీ, వాజపాయి చేసిన కృషే కార‌ణ‌మ‌ని తేల్చిచెప్పారు. ఎక్క‌డా న‌రేంద్ర మోడీ ప్ర‌స్తావ‌న తేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యాఖ్య‌ల‌పైన బీజేపీలో క‌ల్లోలం రేగింది. అయినా మ‌రోమారు నితిన్ గ‌డ్క‌రీ హాట్ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో.. అవసరానికి వాడుకుని వదిలేయకూడదంటూ నాగ్‌పూర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో నితిన్ గ‌డ్క‌రీ వ్యాఖ్యానించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు కాదని, అత‌డిని వాడుకుని పూర్తిగా వదిలేసినప్పుడే అంతమవుతాడని సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు.

వ్యాపారం, సామాజిక సేవ‌లు, రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలమ‌ని గ‌డ్క‌రీ చెప్పారు. అయితే, ఎవరూ ఎవ‌రిని వాడుకుని వదిలేసే మనస్తత్వంతో వ్యవహరించకూడద‌న్నారు. మంచి, చెడుల సమయంలోనూ పట్టుకున్న చేతిని వదలకూడద‌ని సూచించారు. ఎల్లప్పుడూ పట్టుకునే ఉండాల‌న్నారు. ఉదయించే సూర్యుడిని (ఎదిగే వ్యక్తులను) పూజించొద్ద‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో ప్ర‌ధాని మోడీ పెరుగుతున్న వ్య‌క్తి పూజ‌ను ల‌క్ష్యంగా చేసుకునే నితిన్ గ‌డ్క‌రీ ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అలాగే ఇదే కార్య‌క్ర‌మంలో గ‌డ్క‌రీ తాను విద్యార్థి నాయ‌కుడిగా ఉన్న రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. త‌న‌ను కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని ఆ పార్టీ నేత‌లు అప్ప‌ట్లో కోరార‌న్నారు. అయితే కాంగ్రెస్ భావ‌జాలం త‌న‌కు న‌ప్ప‌ద‌ని చెప్పాన‌న్నారు. మీ పార్టీలో చేర‌డం కంటే ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డ‌మే మంచిద‌న్నాన‌ని తెలిపారు.

కాగా ఇలా సూటిగా, కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడే తత్వమే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గ‌డ్క‌రీ ఉద్వాస‌న‌కు కార‌ణ‌మైంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాకుండా బీజేపీ పార్ల‌మెంటరీ బోర్డులో త‌న‌కు ఉద్వాస‌న ప‌ల‌క‌గానే బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ఎల్‌కే అద్వానీ, అట‌ల్ బిహారి వాజ్‌పాయి చేసిన కృషే కార‌ణ‌మ‌ని నితిన్ గ‌డ్క‌రీ వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News