చంద్రబాబు ‘లెక్క’ కేంద్రం తేల్చనుందా?

Update: 2017-07-18 17:34 GMT
    ఏపీకి ప్రత్యేక హోదా ఎలాగూ పోయింది... కనీసం ప్రత్యేక సాయమైనా కరెక్టుగా అందాలంటే రాష్ర్ట ప్రభుత్వం చేతిలోనే ఉంది. మరి ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఎంతవరకు కేంద్రం సూచనలు పట్టించుకుని నిధులను సాధిస్తుందో చూడాలి. ఎందుకంటే చేసిన ఖర్చు సంబంధించిన లెక్కలు చూపిస్తేనే సాయం అందిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అది కూడా పార్లమెంటు సాక్షిగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్వయంగా వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.

    కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద ఇప్పటివరకూ విడుదల చేసిన నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆడిట్‌ చేసిన లెక్కల వివరాలు సమర్పించాకే ఏపీకి ప్రత్యేక సాయం విడుదల చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని  ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్‌ మేఘవాల్‌  స్పష్టం చేశారు.

    దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అడిగిన ప్రశ్నలుక సమాధానంగా ఏపీకి ఎంతెంత ఇచ్చామన్నది మంత్రులు వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 3285.15 కోట్ల రూపాయిలను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి రామ్‌కృపాల్‌ యాదవ్‌ తెలిపారు. విశాఖలో 50 పడకలతో సమగ్రమైన ఆయుష్‌ ఆస్పత్రి ఏర్పాటుకు గత ఏడాది బడ్జెట్‌లో కేంద్రం కోటి రూపాయలు విడుదల చేసినట్లు ఆయుర్వేద, యోగ, నేచురోపతి శాఖ సహాయమంత్రి శ్రీపాద యశ్సో నాయక్‌ వెల్లడించారు. అమరావతిలో రూ.253.40 కోట్ల అంచనా వ్యయంతో ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ నిర్మించనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ తెలిపారు. ఇందులో కేంద్ర సాయం రూ.152 కోట్లు ఉంటుందని వివరించారు. ఇలా దేనికెంత ఇచ్చామన్నది కేంద్రం పార్లమెంటులో చెప్పుకొచ్చింది.

    అయితే... ఏపీ గవర్నమెంటు కేంద్రం ఇచ్చిన ఆ నిధులను ఏం చేసిందన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే కేంద్రం చెప్పినవాటిలో చాలా వరకు నిధుల ఖర్చన్నది ఏపీలో కనిపించడం లేదని విపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో చేసిన ఖర్చులు ఎలా చూపిస్తారు... కేంద్రం నుంచి తదుపరి సాయం ఎలా పొందుతారాన్న ప్రశ్న వినిపిస్తోంది.
Tags:    

Similar News