బిగ్ బ్రేకింగ్... మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు

Update: 2020-05-01 13:30 GMT
అనుకున్నదే అయ్యింది. ప్రాణాంతక వైరస్ కరోనా కట్టడి కోసం ఇప్పటిదాకా రెండు విడతలుగా లాక్ డౌన్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. మూడో దశ లాక్ డౌన్ ను కూడా ప్రకటించింది. రెండో విడత లాక్ డౌన్ ఈ నెల 3తో ముగియనున్న నేపథ్యంలో... శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మూడో విడత లాక్ డౌన్ ను ప్రకటించేసింది. మూడో విడత లాక్ డౌన్ ను రెండు వారాల పాటు అమలు చేయనున్నట్లుగా ప్రకటించిన కేంద్రం... ఈ దశ లాక్ డౌన్ మే 17 వరకు అమల్లో ఉంటుందని సంచలన ప్రకటన చేసింది.

ఇప్పటికే రెండు విడతల లాక్ డౌన్ అమలు చేసినా కరోనా మహమ్మారి దేశంలో తగ్గుముఖం పట్టిన దాఖలా కనిపించడం లేదు. తొలి విడత లాక్ డౌన్ లో అంతగా కనిపించని వైరస్ ఉధృతి రెండో దశ లాక్ డౌన్ లో ఓ రేంజిలో పెరిగింది. ఫలితంగా రెండో దశ లాక్ డౌన్ గడువు ముగియకముందే... మూడో విడత లాక్ డౌన్ ను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయక తప్పలేదు. రెండో విడత లాక్ డౌన్ గడువు సమీపిస్తున్న తరుణంలో మూడో విడత లాక్ డౌన్ ఉంటుందా? ఉండదా? అంటూ పెద్ద ఎత్తున విశ్లేషణలు జరిగాయి. అయితే ఆర్థిక రంగానికి పునరుజ్జీవం తేవాలంటే... లాక్ డౌన్ ను ముగించాల్సిందేనంటూ పలు రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్రం కూడా ఇదే తరహాలోనే ఆలోచించినా.. కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే మూడో దశ లాక్ డౌన్ ను ప్రకటించక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... నిపుణుల మాట ఎలా ఉన్నా దేశంలో తాజా పరిస్థితులను అంచనా వేసిన జనం మూడో దశ లాక్ డౌన్ తప్పదన్న భావనతోనే ఉండిపోయారు. అంతేకాకుండా రెండో దశ లాక్ డౌన్ గడువు సమీపిస్తున్న కీలక తరుణంగా ఎక్కడికక్కడ చిక్కుబడిపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా ప్రకటన వెలువడినంతనే... మూడో దశ లాక్ డౌన్ కూడా ఉండబోతోందన్న మాట గట్టిగానే వినిపించింది. రెండో దశతోనే లాక్ డౌన్ ను ఎత్తేసేటట్టైతే... వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్రం చెప్పదు కదా. సో.... వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలన్నప్పుడే మూడో దశ లాక్ డౌన్ తప్పదన్న భావన వినిపించింది. అనుకున్నట్లుగానే కేంద్రం మూడో దశ లాక్ డౌన్ ను ప్రకటించేసింది.
Tags:    

Similar News