జనసేన తీర్థం పుచ్చుకున్న చదలవాడ!

Update: 2018-10-18 18:20 GMT
మ‌రి కొద్ది నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. తమ పార్టీని మాజీ నేత‌లు, కొత్త నాయ‌కుల‌తో నింపుకునేందుకు అన్ని పార్టీలు  ప్ర‌య‌త్నిస్తోన్నాయి. ఈ క్ర‌మంలోనే దాదాపుగా రాజ‌కీయాల‌కు నాలుగేళ్లుగా దూరంగా కొంద‌రు నేత‌లు త‌మ‌కు న‌చ్చిన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆ చేరిక‌లు జ‌న‌సేన‌లో ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. కేడ‌ర్ పెద్ద‌గా లేని జ‌న‌సేన‌లో తాజాగా ఉమ్మ‌డి ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేరిన విష‌యం విదిత‌మే. తాజాగా, నేడు విజ‌యద‌శ‌మినాడు తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేన కండువా క‌ప్పుకున్నారు.

పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయ‌న జనసేన తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాను బాధితులను పరామర్శిస్తోన్న పవన్ ను ఆయ‌న క‌లిశారు. శ్రీ‌కాకుళం వెళ్లి ప‌వ‌న్ ను క‌లిసిన‌ చదలవాడ పార్టీలో చేరారు. చదల‌వాడకు పార్టీ కండువా కప్పి పవన్ సాదరంగా ఆహ్వానించారు. మొద‌టి నుంచి కాంగ్రెస్ కార్య‌క‌ర్త అయిన చ‌ద‌ల‌వాడ‌....1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత 2014లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే టీటీడీ ఛైర్మన్ గా నియమితుల‌య్యారు. ఆ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత సైలెంట్ గా ఉన్న చ‌ద‌ల‌వాడ‌...తాజాగా జ‌నసేనలో చేరారు. త్వ‌ర‌లోనే మ‌రింత‌మంది జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News