కొత్తబంధం:బాబు రైటంటూ భాజపాను తిడ్తున్నారు!

Update: 2018-02-23 12:30 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో చీటికీ మాటికీ కేంద్రంలోని భాజపాతో తాము తెగతెంపులు చేసుకుంటే వారితో కలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కాచుకుని ఉన్నారని అంటూనే ఉంటారు. కానీ ఇప్పటిదాకా వారిద్దరి బంధం తెగిపోయే తరహాలో జగన్ ఎన్నడూ మాట్లాడలేదు. కేంద్రాన్ని నిందించదలచుకున్నప్పుడు.. వారి కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం కరెక్టు కాదు అనే వాదన  ఒక్కటే ఆయన చేశారు.

అయితే తాజాగా బాబు-భాజపా బంధం తెగిపోవాలని చాలా మంది ఇతరులు వారు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వారంతా బాబును విమర్శిస్తున్న రాష్ట్ర భాజపా మీదనే ఫోకస్ పెడుతూ.. బాబును తిట్టదలచుకుంటే.. ఈ కేబినెట్ నుంచి ముందు మీరు బయటకు పొండి అనే పదునైన విమర్శలు సంధిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రత్యేకహోదా సాధన సమితి పేరుతో ఆందోళనలు చేస్తున్న వారిలో చలసాని శ్రీనివాస్ ప్రముఖులు. ఆయన తాజాగా రాష్ట్ర భాజపా వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పట్ల.. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒకే రకమైన మాట మాట్లాడుతోంటే భాజపా మాత్రం సమర్థించుకోవడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. వారికి అంత అభిప్రాయ భేదాలు ఉండేట్లయితే ముందు ఏపీ కేబినెట్ నుంచి భాజపా వైదొలగాలని చలసాని శ్రీనివాస్ అంటుండడం విశేషం. ఏపీకి ప్రత్యేకహోదా సంజీవని అని ఆయన అంటున్నారు.

ఇదే తరహా మద్దతు చంద్రబాబుకు వామపక్షాలనుంచి కూడా వస్తుండడం గమనార్హం. ఏపీ కేబినెట్ లో భాగస్వామిగా ఉంటూనే చంద్రబాబు హోదా డిమాండ్ ను విమర్శించడం అంటే.. ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే అని సీపీఐ రామకృష్ణ అంటున్నారు. రాష్ట్ర భాజపా నాయకుల్ని కేంద్రంనుంచి రాంమాధవ్ నడిపిస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేయడం విశేషం.

చూడబోతే.. వీరిద్దరికీ తెగతెంపులు అయితే.. భాజపా తో జగన్ కలవడం జరుగుతుందో లేదో గానీ.. చంద్రబాబుకు దగ్గర కావడానికి వామపక్షాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇంకో ట్విస్టు

ఈ పార్టీలన్నీ చంద్రబాబును సమర్థించడం ఒక ఎత్తు. కాంగ్రెస పార్టీ సమర్థించడం మరో ఎత్తు. ఏపీ ప్రయోజనాలకోసం మోడీ, అమిత్ షా లను ప్రశ్నించే దమ్ములేక హోదా కోసం పోరాడుతున్న వారి మీద సోము వీర్రాజు విమర్శలు చేస్తున్నారంటూ ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అనడం విశేషం. సీఎం లేకలేక ప్రత్యేకహోదా కోసం పోరాడుతోంటే భాజపా రాద్ధాంతం చేస్తున్నదని ఆయన విమర్శించడం గమనార్హం.
Tags:    

Similar News