పాపం వెంటాడుతోంది.. అరెస్టు అయిన చందాకొచ్చర్ భర్త

Update: 2020-09-08 05:30 GMT
అత్యున్నత స్థాయికి చేరుకోవటం కష్టం కాకపోవచ్చు. కానీ.. అక్కడ నిలవటం.. నిలబడటం చాలా కష్టం. తన వ్యక్తిగత సామర్థ్యంతో ఒక బ్యాంకుకు తిరుగులేని ఇమేజ్ ను తీసుకురావటమే కాదు.. దేశీయంగా మహిళా శక్తి ఎంత అన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసిన డైనమిక్ మహిళగా చందాకొచ్చర్ ను చెప్పాలి. కొన్నేళ్ల పాటు నాన్ స్టాప్ గా వెలిగిపోయిన ఆమె.. భర్త కారణంగా దారుణ పరాభవాల్ని ఎదురుచూస్తున్నారు.

అత్యున్నత పదవిని పోగొట్టుకోవటమే కాదు.. కేసుల్ని ఎదుర్కొంటూ తీవ్ర అవమానాలకు ఎదురయ్యే పరిస్థితి. ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల స్కాంలో సదరు బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త కమ్ వ్యాపార వేత్త దీపక్ కొచ్చర్ అరెస్టు అయ్యారు. రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాటు.. మనీ లాండరింగ్ కు సంబంధించిన తగిన ఆధారాలు లభ్యం కావటంతో ఆయన అరెస్టు తప్పలేదు.

ఇంతకీ ఏం జరిగింది? చందాకొచ్చర్ భర్త చేసిన తప్పేమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. వీడియోకాన్ గ్రూపునకు రూ.1875 కోట్ల రుణాన్ని మంజూరు చేయటంలో అవినీతికి పాల్పడ్డారంటూ చందాకొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్ నకు చెందిన వేణుగోపాల్ దూత్ పైనా కేసులు నమోదు కావటం తెలిసిందే.

ఈ ఆరోపణల నేపథ్యంలోనే అప్పటివరకు ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా వ్యవహరించిన చందాకొచ్చర్.. తన పదవి నుంచి తప్పుకున్నారు. అలా చెప్పే కంటే ఆమెను తప్పించారని చెప్పటమే సబబు. ఈ కేసులో భాగంగా దీపక్ కొచ్చర్ ను పలుమార్లు విచారించిన ఈడీ.. చివరకు ఆరోపణలకు తగ్గ ఆధారాలు లభించటంతో అరెస్టు తప్పలేదు.

వీడియోకాన్ తో పాటు.. గుజరాత్ కు చెందిన బయోటెక్ ఫార్మా.. భూషణ్ స్టీల్ సంస్థలకు సైతం భారీ ఎత్తున రుణాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబందించి కూడా విచారణ సాగుతోంది. చేసిన పాపం ఊరికే పోదన్న రీతిలో.. పవర్ చేతిలో ఉన్నప్పుడు చేసే తప్పలకు.. తర్వాత తీరిగ్గా మూల్యం చెల్లించాలన్న విషయం చందాకొచ్చర్ దంపతులకు ఇప్పటికే అవగతమై ఉంటుంది.
Tags:    

Similar News