నాగబాబుకు ఆ శాఖలు... పవన్ మదిలో ఏముందో ?
ముఖ్యంగా జనాలతో కనెక్ట్ అయ్యే విధంగా శాఖలను తీసుకుంటే పార్టీ ఉన్నతికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారుట.
మొత్తానికి చూస్తే మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అయినట్లే అని అంటున్నారు. ఆయన మార్చిలో ఎమ్మెల్సీ కావడం ఆ వెంటనే మంత్రిగా ప్రమాణం చేయడం వరసగా జరిగిపోతాయని అంటున్నారు. ఇక నాగబాబుకు ఏ శాఖలు కేటాయిస్తారు అన్నదే ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. నాగబాబుకు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖలు ఇస్తారని ప్రచారం సాగుతోంది.
అయితే ఈ శాఖలను తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అంత సుముఖంగా లేరని అంటున్నారు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ శాఖ తీసుకుంటే తమ కుటుంబం మొత్తం సినీ రంగంలో ఉంది కాబట్టి ఏమి చేసినా ఏమి చేయాలని చూసినా ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయని పైగా దీని వల్ల ఇబ్బందులే వస్తాయని ఆలోచిస్తున్నారుట. టూరిజం శాఖ విషయంలోనూ అంత మొగ్గు చూపించడం లేదు అని అంటున్నారు.
ఇక పవర్ ఫుల్ శాఖలు అడగాలని పార్టీలో నుంచి సూచనలు వస్తున్నా కూడా పవన్ వాటి మీద కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. నాగబాబు మొదటిసారి మంత్రి అవుతున్నారని అందువల్ల ఆయన ముందు తన పనితీరుతో శభాష్ అనిపించుకుంటే ఆ మీదట కీలక శాఖలు కోరుకున్నా అపుడు అందులో కూడా నూరు శాతం పనితీరు చూపించగలరు అంటున్నారు.
నాగబాబు మీద ఎన్నో అంచనాలు ఉన్న టైం లో లో ప్రొఫైల్ లోనే ఆయన మంత్రిత్వ శాఖలు పనితీరు సాగే విధంగా పవన్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అన్న గారి మీద ఫోకస్ ఎక్కువగా పార్టీ నుంచే కాదు కూటమి నుంచి జనాల నుంచి కూడా ఉంటుందని అందువల్ల ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండడంతో పాటు పార్టీకి మేలు జరిగేలా శాఖలు తీసుకుంటే బాగుంటుంది అన్నది పవన్ మదిలో మెదులుతున్న ఆలోచనలుగా చెబుతున్నారు.
ముఖ్యంగా జనాలతో కనెక్ట్ అయ్యే విధంగా శాఖలను తీసుకుంటే పార్టీ ఉన్నతికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారుట. అందుకే యువజన సర్వీసులు అలాగే మత్స్య శాఖలను నాగబాబు కోసం పవన్ సీఎం చంద్రబాబుని కోరాలని చూస్తున్నారుట. యువజన సర్వీసుల శాఖ కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి వద్ద ఉంది అని అంటున్నారు.
ఈ శాఖను తీసుకుంటే యువతకు చేరువ కావచ్చు అని జనసేనలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి వారిని కలుపుకుని పోతూ యువతకు పధకాలను అందించవచ్చు అన్నది ఒక ఆలోచనగా ఉంది అని అంటున్నారు. అలాగే మత్స్య శాఖ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని అంటున్నారు.
ఈ శాఖ వల్ల ఏపీలో ఉమ్మడి జిల్లాలు తొమ్మిదింటిలో ఉన్న అత్యధిక సంఖ్యలోని మత్స్యకారులకు మేలు చేయడం ద్వారా వారిని పార్టీ వైపుగా తిప్పుకోవచ్చు అన్నది కూడా చర్చగా ఉందిట. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ తన అన్న గారు తీసుకునే శాఖల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సిందే.