లోకేష్ చేయాల్సింది ఏంటో చెప్పేశారా...?

Update: 2022-01-13 09:30 GMT
చంద్రబాబు తరువాత టీడీపీకి ఆయనే పెద్ద దిక్కు. ప్రాంతీయ పార్టీలలో జరిగే తంతు అదే. తండ్రి తరువాత వారసునిగా  కుమారుడు లేక కుమార్తె మాత్రమే అవుతారు. ఎటూ చంద్రబాబుకు ఏకైక పుత్రరత్నం కాబట్టి లోకేష్ కి ఏ పోటీ లేదు. దాంతో ఆయన చాలా కాలంగా టీడీపీ రాజకీయాల్లో దూకుడు చేస్తూ వస్తున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే లోకేష్ సీఎం అయి ఉండేవారు అన్నది తమ్ముళ్ళ మాట. అయితే టీడీపీ  గెలవలేదు సరికదా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి లోకేష్ తానే  ఓడిపోయాడు.

దాంతో ఒక్కసారిగా లోకేష్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. పార్టీలో కూడా సీనియర్లు చంద్రబాబుకే కంటిన్యూ అవమంటూ వచ్చారు. లోకేష్ సైతం యంగ్ బ్లండ్ అంటూ తనకో టీ, ని ఏర్పాటు చేసుకుని ఆ మధ్యంతా హడావుడి చేశారు. దాంతో సీనియర్లకు అది ఇబ్బందిగా మారింది. చంద్రబాబు కూడా కొన్నాళ్ళు లోకేష్ ని అలా వదిలేశారు. ఆయనను ముందు పెట్టి పొలిటికల్ స్టోరీ నడిపించాలనుకున్నారు. కానీ జగన్ వర్సెస్ లోకేష్ అంటే కచ్చితంగా అది టీడీపీకే దెబ్బ తీస్తుందని భావించిన వారంతా బాబుకు సలహా ఇచ్చారట. మీరే కావాలి, మీరే రావాలని వారు కోరస్ ఆలపించారట.

దాంతో చంద్రబాబు మళ్లీ రంగంలోకి వచ్చారు. ఆయన గత కొన్నాళ్ళుగా దూకుడు చేస్తున్నారు. ఈ అసెంబ్లీకి మళ్ళీ వచ్చేది ముఖ్యమంత్రిగానే అంటూ బాబు భీషణ ప్రతిన చేయడం వెనక కూడా తానే రేపటి సీఎం అని తెలుగు జనాలకూ, తెలుగుదేశం పార్టీకి చెప్పడమే అంటున్నారు. అలా లోకేష్ మళ్ళీ బ్యాక్ బెంచి కి వెళ్లారని  తెలుస్తోంది.

ఇక ఈ మధ్య చంద్రబాబే మంగళగిరి ఆఫీస్ కి తరచూ వస్తూ మీడియాతో టచ్ లో ఉంటున్నారు. అలాగే ఏపీలో జిల్లాల  టూర్లు కూడా షురూ చేశారు. ప్రతీ రోజూ జగన్ సర్కార్ మీద ఒక రేంజిలో విరుచుకుపడుతున్నారు. జగన్ కి ఒక్క చాన్స్ అంటూ ఇచ్చారు, కానీ ఆయనకు ఏ అనుభవం లేనందువల్లనే రాష్ట్రం ఇలా అయిపోయింది అని బాబు పదే తన మీటింగుల్లో చెబుతున్నారు. దాని అర్ధం విశేష అనుభవం ఉన్న తనను సీఎం గా చేయమని చెప్పడమే. ఆ విధంగా చంద్రబాబు 2024 లో టీడీపీ గెలిస్తే తానే సీఎం కావాలని చూస్తున్నారు.

ఇక జగన్ ఏపీని సర్వనాశనం చేశారని, దానిని గాడిలో పెట్టడానికి తన అనుభవం  సామర్ధ్యం మొత్తం ఉపయోగిస్తానని బాబు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు దీక్షా దక్షతల మీద ఏపీ జనాలకు నమ్మకం ఎక్కువగానే ఉంది. అందువల్ల జగన్ వర్సెస్ చంద్రబాబు అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయాలు అందుతాయని ఆశాభావంతో ఉన్నారు.

ఇక లోకేష్ విషయానికి వస్తే ఆయన్ని కేవలం మంగళగిరి నియోజకవర్గానికే పరిమితం చేశారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ అక్కడ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలన్నదే బాబు మార్క్ పాలిటిక్స్ గా ఉందిట. ఇక పార్టీ వ్యవహారాలు అన్నీ కూడా బాబు కనుసన్నలోనే జరుగుతాయని అంటున్నారు. రేపటి రోజున ఎన్నికల ముందు పాదయాత్ర అయినా బస్సు యాత్ర అయినా చంద్రబాబే చేస్తారని చెబుతున్నారు.

అదే విధంగా పొత్తుల గురించి కానీ అభ్యర్ధుల ఎంపిక విషయం కానీ అన్నీ చంద్రబాబే దగ్గరుండి చూసుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికలలో కూడా పార్టీని  తానే దగ్గరుండి నడిపించాలని బాబు ఆశిస్తున్నారు. తాను సీఎం అయ్యాక అపుడు రాజకీయ వారసత్వం గురించి ఆలోచించవచ్చు అన్నది ఆయన నయా ప్లాన్ గా ఉందిట. దాంతోనే లోకేష్ చంద్రబాబు చెప్పిన మేరకు మంగళగిరికే పరిమితం అయ్యారని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయం బాగానే ఉంది. ఇక ఏపీ జ‌నాలు సీనియర్ నేతగా బాబుని ఆదరిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News