బాబుకు భ‌యం!... జ‌గ‌న్‌ కూ భ‌య‌మే!

Update: 2019-01-20 11:11 GMT
ఏపీలో ఎన్నిక‌ల‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ది. ఇంకో నాలుగు నెల్ల‌లోగా ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా పూర్తి కానున్నాయి. వ‌చ్చే నెల ప్ర‌థ‌మార్ధంలోనే ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ను జారీ చేయ‌నుంది. అంటే దాదాపుగా ఇప్పుడంతా ఎన్నికల స‌మ‌యం వ‌చ్చేసిన‌ట్టుగానే చెప్పుకోవాలి. ఇలాంటి కీల‌క త‌రుణంలో వైరి వ‌ర్గాల వ్యూహాల‌ను ప‌సిగ‌డుతూ వాటికి దీటుగా వ్యూహాలు ర‌చించుకుంటూ ముందుకు వెళ్లిన వారినే విజ‌యం వ‌రిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అబ‌ద్ధ‌పు, అమ‌లు సాధ్యం హామీలు ఇవ్వ‌లేర‌న్న ఒకే ఒక్క విష‌యంపై దెబ్బ కొట్టేసిన టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబునాయుడు ఎన్నిక‌ల్లో విన్న‌ర్ గా నిలిచారు. అయితే నాడు చంద్ర‌బాబు ప‌న్నిన వ్యూహానికి ఇప్పుడు విరుగుడు వ్యూహాన్ని ర‌చించుకుంటూ ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌... ఈ ద‌ఫా విజ‌యం త‌న‌దేన‌న్న ధీమాతో ఉన్నారు. అయితే ఎప్పుడూ తాను ప్ర‌యోగించే త‌న‌దైన వ్యూహాలు ఇప్పుడు ఉప‌క‌రించి... ఈ సారి కూడా గెలుపు త‌న‌దేన‌న్న భాన‌లో చంద్ర‌బాబు కూడా ఉన్నారు.

అయితే వీరిద్ద‌రూ ఇటీవ‌లే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను చాలా ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించారు. ఎన్నిక‌ల‌కు చాలా ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా టీఆర్ఎస్ ఈజీగానే విజ‌యాన్ని అందుకుంద‌న్న విష‌యాన్ని కూడా చంద్ర‌బాబుతో పాటు జ‌గ‌న్ కూడా విశ్వ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీలోనూ టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు అనుస‌రించిన వ్యూహాన్ని అమ‌లు చేసి... ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానూ అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని కూడా ఇద్ద‌రూ నిర్ణ‌యించుకున్నారు. అయితే ఇప్ప‌టిదాకా ఏ ఒక్క పార్టీ నుంచి కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల కాలేదు. అంతేనా... ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇంకా వేచి చూసే ధోర‌ణినే అవ‌లంబించేందుకు చంద్ర‌బాబు మొగ్గుచూపుతున్న‌ట్లుగా వినికిడి. ఎందుకంటే.. తానే ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే..  అసంతృప్తులంతా వైసీపీ గూటికి చేరి... అది అంతిమంగా త‌న ప‌రాజ‌యానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌ట‌. దీనికి విరుగుడుగా... జ‌గ‌న్ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేదాకా వేచి చూడాల‌ని కూడా బాబు దాదాపుగా నిర్ణ‌యించేసుకున్నార‌ట‌. జ‌గ‌న్ ముందుగా త‌న పార్టీ కేండిడేట్ల‌ను ప్ర‌క‌టిస్తే... అక్క‌డ అసంతృప్తితో ర‌గిలిపోయే నేతలంతా వచ్చి త‌న పార్టీలో చేర‌తార‌ని, అంతిమంగా ఇది త‌న‌కు క‌లిసివ‌చ్చే అంశ‌మేన‌ని బాబు వ్యూహంగా వినిపిస్తోంది.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు విజ‌యం ప‌క్కా అనే ధీమాతో ఉన్న జ‌గ‌న్‌... ఇప్ప‌టికే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశార‌ట‌. అయితే ఆ పేర్ల‌ను ప్ర‌క‌టించేందుకు జ‌గ‌న్ సిద్ధం కాలేదు. ఈ విష‌యంలో చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకున్న‌ట్టుగానే... జ‌గ‌న్‌ కూ ఓ భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. అయితే చంద్ర‌బాబును భ‌య‌పెడుతున్న అంశమే జ‌గ‌న్‌ను భ‌య‌పెడుతుంద‌ని చెప్ప‌డానికి ఏమాత్రం వీలు లేద‌ట‌. ఎందుకంటే... అలాంటి భ‌యం ఉంటే... జ‌గ‌న్ ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసుకుని ఉండ‌రు క‌దా. మ‌రి జ‌గ‌న్ భ‌య‌మేమిటంటే... ఇప్పుడే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే... ఆయా అభ్య‌ర్థులు ఇప్ప‌టినుంచే ఖ‌ర్చులు మొద‌లు అవుతాయి. తీరా పోలింగ్ సమ‌యం వ‌చ్చేస‌రికి అభ్య‌ర్థుల చేతిలోని డ‌బ్బంతా ఖ‌ర్చైపోగా... త‌న అభ్య‌ర్థుల వ‌ద్ద నిధుల లేమి అధికార పార్టీకి క‌లిసి వ‌స్తుంద‌న్న‌ది జ‌గ‌న్ భ‌యంగా చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నేత‌లుగా టీడీపీ నేత‌ల వ‌ద్ద ఉన్నంత నిధులు విప‌క్ష పార్టీ అభ్య‌ర్థుల వ‌ద్ద ఉంచే ఛాన్సు లేదు క‌దా. ఈ కార‌ణంగానే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌ర్వాత గానీ... త‌న పార్టీ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించ‌ర‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News