ప‌ట్టు కోసం బాబు ప్ర‌య‌త్నాలు

Update: 2021-11-16 08:30 GMT
ఎప్పుడూ లేని విధంగా కుప్పం మున్సిపాలిటీకి జ‌రుగుతున్న పోలింగ్ కోసం స్వ‌యంగా మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు అక్కడే మ‌కాం వేయడం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాశంగా మారింది. సాధార‌ణంగా అయితే పార్టీ అధినేత సార‌థ్యంలో కింది స్థాయి నేత‌లు మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం పాటుప‌డ‌తారు. కానీ ఇక్క‌డ బాబే రంగంలోకి దిగ‌డం చ‌ర్చ‌లు దారికి తీసింది. కుప్పంలో పార్టీ విజ‌యాన్ని ఆయ‌న ఎంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారో ఈ ప‌రిణామ‌మే చాటి చెబుతోంది.

ఎందుకిలా..

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పం నుంచి శాన‌స స‌భ్యుడిగా బాబు గెలుస్తూనే వ‌స్తున్నారు. ఆయ‌న ప్ర‌చారం కోసం ఈ నియోజ‌క‌వ‌ర్గానికి రాక‌పోయినా అక్క‌డి ప్ర‌జ‌లు ఓట్లు వేస్తూనే ఉన్నారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న‌కు ఎలాంటి టెన్ష‌న్ లేకుండా పోయింది. కానీ గ‌త ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించి అధికారం అందుకున్న వైసీపీ.. అప్ప‌టి నుంచి కుప్పంపై దృష్టి పెట్టింది. బాబుకు కంచుకోట అయిన కుప్పంలో టీడీపీకి బీట‌లు వారిస్తే మాన‌సికంగానూ దెబ్బ కొట్టిన‌ట్లు ఉంటుంద‌ని జ‌గ‌న్ భావించిన‌ట్లు తెలిసింది. అందుకే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇక్క‌డ జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి త‌న వ్యూహాల‌తో టీడీపీకి చెక్ పెట్టేందుకు వేగంగా సాగుతున్నారు. స్థానిక సంస్థ‌లు, జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఇలా దాదాపు అన్ని ఎన్నిక‌ల్లోనూ టీడీపీపై వైసీపీ భారీ మెజారిటీ సాధించింది. దీంతో కుప్పంలో ఇక బాబు మాట చెల్ల‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

బాబు జాగ్ర‌త్త‌

వ‌రుస‌గా కుప్పంలో త‌న పార్టీకి ఎదురు దెబ్బ‌లు త‌గ‌ల‌డంతో స్వ‌యంగా బాబే రంగంలోకి దిగారు. అక్క‌డ ప్ర‌జ‌ల‌ను పార్టీ దాటి వెళ్ల‌కుండా ఉండేందుకు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. అందులో భాగంగానే గ‌త నెల‌లో కుప్పంలో ప‌ర్య‌టించారు. స‌భలో మాట్లాడుతూ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ తిరిగి పొందేందుకు ప్ర‌య‌త్నించారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో టీడీపీనే గెలిపించాల‌ని చేతులెత్తి దండం పెట్ట మ‌రీ అడిగారు. ఇక నామినేష‌న్ల ప్ర‌క్రియ ద‌గ్గ‌ర నుంచి అన్ని ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగాయి. ప్ర‌చారం కోసం పెద్ద నాయ‌కుల‌నూ అక్క‌డికి పంపించారు. త‌న త‌న‌యుడు నారా లోకేష్‌తోనూ ప్ర‌చారం చేయించారు. అయినా పార్టీ విజ‌యంపై ఏ మూల‌నో అనుమానం ఉండ‌డంతో పోలింగ్ రోజే స్వ‌యంగా ఆయ‌నే కుప్పం వ‌చ్చారు. మ‌రోవైపు కుప్పంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయాలంటూ ఓ లేఖ రావ‌డం బాబుకు మ‌రింత టెన్ష‌న్ పెంచింది.  అందుకే ఆయ‌న ద‌గ్గ‌ర ఉండి పోలింగ్ స‌ర‌ళిని గ‌మ‌నిస్తున్నారు.

ఈ ఎన్నిక‌ల్లో క‌నుక టీడీపీ ఓడిపోతే వ‌చ్చే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బాబుకు తిప్ప‌లు త‌ప్ప‌వు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే పార్టీని కాపాడుకోలేని నాయ‌కుడు ఇక రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వ‌స్తార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అందుకే ఇప్పుడు ఎలాగైనా పార్టీని గెలిపించి తిరిగి పుంజుకోవ‌డంతో పాటు కుప్పం ప్ర‌జ‌లు త‌న‌వైపు ఉంటార‌ని మ‌రోసారి చాటేందుకు బాబు ఈ ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తున్నారని విశ్లేష‌కులు అంటున్నారు.
Tags:    

Similar News